ఎల్ నినో సన్నద్ధతపై రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం

  • నిర్వహణ; శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందింపు దిశగా చర్చలు

హైదరాబాద్ : వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, వ్యవసాయం దాని అనుబంధ రంగాల కోసం రాష్ట్ర స్థాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, ఉపశమన, అనుసరణ చర్యలను సిఫారసు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన బహుళ విభాగాల నిపుణుల కమిటీ తొలి సమావేశం బుధవారం ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ కమిటీలో భారత వాతావరణ శాఖ, ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, మార్క్ ఫెడ్, ఆయిల్‌ఫెడ్, జాతీయ విత్తన సంస్థ, తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా డా. జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో తెలంగాణలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. గత ఆరు నెలలుగా ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చాలా మంది భావించారని, అయితే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున సుమారు 30 శాతం వర్షపాత లోటు నమోదైందని, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 23 జిల్లాల్లో వర్షపాత లోటు ఉందని తెలిపారు. ఎల్ నినో శాస్త్రీయ నేపథ్యాన్ని వివరిస్తూ, పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగి వరుసగా కొన్ని నెలలు కొనసాగితే దానిని ఎల్ నినోగా పరిగణిస్తారని తెలిపారు. ఎల్ నినో–సదర్న్ ఆసిలేషన్ ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రధాన సహజ చక్రమని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల్లో వాణిజ్య పవనాలు బలహీనపడటంతో వేడి సముద్ర జలాలు తూర్పు వైపు కదలి నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తాయని, లా నినా పరిస్థితుల్లో సాధారణంగా భారతదేశంలో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావమే రాష్ట్రంలో వర్షపాత లోటుకు ప్రధాన కారణమని తెలిపారు.

వర్షపాత లోటు నమోదైన జిల్లాలకు సంబంధించిన జిల్లా, మండలాల వారీ వాతావరణ సమాచారం, వర్షపాతం, పంటల విస్తీర్ణ వివరాలను శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత నిర్ణయాల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. జూలై 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి ఎల్ నినో ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి తగిన ఉపశమన, అనుసరణ చర్యలను సూచించేందుకు ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పర్యావరణ అసమతుల్యత చివరికి మానవాళిపైనే ప్రభావం చూపుతుందని పేర్కొన్న డా. చిన్నారెడ్డి, సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ప్రకృతితో సమన్వయంగా జీవించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఎల్ నినో సవాళ్లు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ విశ్లేషణ, సమగ్ర ప్రణాళిక, సమన్వయ పాలన ద్వారా పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ప్రజల్లో అవగాహన, ప్రవర్తనా మార్పు, సామాజిక భాగస్వామ్యం ప్రభుత్వ చర్యలకు బలాన్ని చేకూరుస్తాయని అన్నారు. సమష్టి కృషి, శాస్త్రీయ మార్గదర్శకత్వం, సమన్వయ చర్యలతో రాష్ట్రం ఈ వాతావరణ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో నిపుణులు ఎల్ నినో, లా నినా, సముద్ర ఉపరితల, ఉప ఉపరితల ఉష్ణోగ్రత మార్పులు, ఓషనిక్ నినో ఇండెక్స్, ఇండియన్ ఓషన్ డైపోల్, ప్రపంచ వాతావరణ ప్రసరణ వ్యవస్థలు, వాటి ప్రభావం వర్షపాతం, ఉష్ణోగ్రతలు, కాలానుగుణ వాతావరణ పరిస్థితులపై ఎలా ఉంటుందనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఎల్ నినో, నైరుతి రుతుపవనాల మధ్య చారిత్రక సంబంధం, వర్షపాతం పంపిణీ, వాతావరణ వైవిధ్యం, తెలంగాణలో ఆలస్యమైన రుతుపవనాల ప్రవేశం, మధ్యలో ఏర్పడిన విరామాలు, జిల్లా వారీ వర్షపాతం ధోరణులు, భారత వాతావరణ శాఖ అంచనాలను సమీక్షించారు.

వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రీయ పంట ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, అంతర పంటలు, తక్కువ నీటితో సాగయ్యే, కరువును తట్టుకునే పంటలు, ముఖ్యంగా చిరుధాన్యాల ప్రోత్సాహం, సమర్థవంతమైన నీటి వినియోగం, రైతులకు శాస్త్రీయ సలహాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కిచెప్పింది. సమీకృత జల వనరుల నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునర్భరణ, అందుబాటులో ఉన్న నీటి వనరుల సుస్థిర వినియోగంపై కూడా చర్చించింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్ గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో జలాశయాల నిల్వలు, నీటి ప్రవాహాలు, సాగునీటి లభ్యత తెలియజేశారు. అధిక శాతం జలాశయాల్లో నీటి ప్రవాహాలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయని, తెలంగాణకు వచ్చే నీటి లభ్యతపై ప్రభావం చూపే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షపాత అంచనాలను నిరంతరం పరిశీలించడం అత్యంత అవసరమని తెలిపారు. తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాశయాల నిర్వహణను అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధనం) నవీన్ మిట్టల్ జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం, విద్యుత్ డిమాండ్ పెరగడం, గరిష్ఠ వినియోగ సమయాల్లో విద్యుత్ కొరత వంటి సవాళ్లను వివరించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం, సమగ్ర ఇంధన ప్రణాళికను అమలు చేయడం అవసరమని సూచించారు. ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాలు, నదుల పరీవాహక ప్రాంతాలు వాతావరణ స్థిరత్వం, జల భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రాష్ట్ర అత్యవసర కార్యాచరణ ప్రణాళికలో అటవీ శాఖను అంతర్భాగంగా చేర్చాలని సూచించారు. దీర్ఘకాలిక వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా అటవీ వ్యవస్థలు, వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, తద్వారా మానవ-వన్యప్రాణుల ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ వర్షపు నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, సామూహిక నీటి సంరక్షణ నిర్మాణాలు, ఉద్యాన పంటల ప్రోత్సాహం వంటి సమన్వయ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ అనుకూలతను పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.
వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం అసమానంగా నమోదవుతోందని, వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీటి లభ్యతను సమగ్రంగా విశ్లేషిస్తూ పంటల సరళిలో వచ్చే మార్పులను అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం సుమారు ఒక మీటరు తగ్గిందని చెప్పారు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉండగా, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటల సాగు పెరిగే అవకాశముందని తెలిపారు. రైతులకు జిల్లా వారీగా శాస్త్రీయ పంటల సలహాలు, నిర్వహణ మార్గదర్శకాలను అందిస్తున్నట్లు వివరించారు.

భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త డా. స్టెల్లా మాట్లాడుతూ రాబోయే నెలల్లో ఎల్ నినో ప్రభావం మోస్తరు స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరే అవకాశముందని, ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థంగానే కొనసాగే అవకాశముండటంతో ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. నైరుతి రుతుపవనాల మిగిలిన కాలంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఎల్ నినో ప్రభావం కొనసాగితే వచ్చే వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధనం) నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భూగర్భ జల విభాగం డైరెక్టర్ కె లక్ష్మ, ఐసీఏఆర్-క్రిడా డైరెక్టర్ డా. వినోద్ కుమార్ సింగ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. అల్దాస్ జనయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. రాజిరెడ్డి, ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాష్, వైస్ ఛాన్సలర్ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పటేల్, శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు కె.వి.ఎన్.రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.