హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “వన మహోత్సవం–2026” కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రజల భాగస్వామ్యంతో నగర హరితాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జూలై 25 (శనివారం) సాయంత్రం 4.00 గంటలకు తార్నాకలోని మర్రి లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ లో తారక సేవా సమాఖ్య (ఎన్జీఓ) సహకారంతో ప్రతి కుటుంబానికి ఐదు ఉచిత మొక్కలు (పండ్ల, ఔషధ, అలంకరణ మొక్కలు) పంపిణీ చేయనున్నట్లు HMDA ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, భూగర్భ జలాల పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణతో పాటు ప్రతి ఇంటిలో ఆరోగ్యకరమైన ఇంటి తోటల ఏర్పాటును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచిత మొక్కలను పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆ ప్రకటనలో తెలిపారు.