- రాష్ట్రంలో వంద కోట్లకు పడగలెత్తిన ఆఫీసర్లపై నిఘా
- లిస్టులో రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, ఎలక్ట్రిసిటీ, అటవీ, పీసీబీ అధికారులు
- అవినీతి, అక్రమాస్తుల ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ
- ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 10 మంది అరెస్ట్
- రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
- సర్కారు ఫ్రీ హ్యాండ్.. ఏసీబీ దూకుడు..
- పక్కా ఆధారాలతో ఒకేసారి దాడులు..
హిట్ లిస్ట్ లో ఉన్న అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాదాపు ఆరు నెలల పాటు నిఘా పెడుతున్నారు. లంచాలు వసూలు చేసే విధానంతో పాటు ఆదాయానికి మించి కూడబెట్టిన అక్రమాస్తులను గుర్తిస్తున్నారు. సొంతంగా, కుటుంబసభ్యుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. అవన్నీ అవినీతి సొమ్ముతో కూడబెట్టినవేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలు చేతికి వచ్చాకే రంగంలోకి దిగుతున్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించేంత వరకు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోదాల సమయంలో పూర్తి వీడియో రికార్డ్ ద్వారా సాక్ష్యాధారాలను కోర్టుకు అందిస్తున్నారు. అలాగే, సంబంధిత అధికారుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపుతున్నారు.
అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. టోలీఫ్రీ నంబర్ కు వస్తున్న ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అందించిన సమాచారం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా పడగెత్తిన 65 మంది అవినీతి అధికారులను గుర్తించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా వారి అక్రమాస్తుల వివరాలను సేకరించి, ఆ చిట్టాను డిపార్ట్ మెంట్ల వారీగా ప్రభుత్వానికి అందించింది. వీరిలో గత బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన అధికారులతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీ రోల్ పోషిస్తున్న వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అధికారుల భరతం పట్టాల్సిందేనని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో ఏసీబీ వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. వీరిలో ఇప్పటికే 10 మందికి పైగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టు ముందు నిలబెట్టింది.
సర్కారు ఫ్రీ హ్యాండ్.. ఏసీబీ దూకుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల భరతం పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏసీబీకి సర్కారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కానీ గతంలో మాదిరి కాకుండా అవినీతి అధికారులను పక్కా ఆధారాలతో చట్టం ముందు నిలబెట్టాలని, వారికి పడే శిక్షలను చూసి మిగిలిన అధికారులు లంచాలు, కమీషన్లు అంటేనే వణికిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఏసీబీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ 65 మంది అవినీతి అధికారులతో హిట్ లిస్ట్ తయారు చేసింది. వీరిలో రెవెన్యూ, పోలీస్, ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, అటవీ, పిసిబి సహా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ఇతర కీలక విభాగాలకు చెందిన ఆఫీసర్లూ ఉన్నారు. ప్రాథమిక విచారణలో ఆయా అధికారుల అక్రమాస్తులు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా ఉన్నట్లు తేల్చి, వారి చిట్టాను ప్రభుత్వానికి అందించింది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రైడ్స్ కొనగిస్తూ ఇప్పటికే పలువురు ‘సెంచరీ వీరులను’ పట్టుకొని చట్టం ముందు నిలబెట్టారు.