100 మంది అవినీతి అధికారులపై ఏసీబీ(ACB) దృష్టి

  • ఇప్పటికే 65 మంది అధికారులపై ప్రాథమిక స్థాయిలో సమాచారం సేకరణ
  • ఆదాయానికి మించిన ఆస్తులపై ACB అధికారుల గురి
  • ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల సమాచార సేకరణ..
  • సర్కార్ గ్రీన్ సిగ్నల్.. త్వరలో దాడులు..!

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న విచ్చలవిడి అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయా శాఖల అధికారులపై దృష్టి కేంద్రీకరించింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చిన ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల నుంచి అందిన సమాచారం ఆధారంగా భారీస్థాయిలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 100 మంది అధికారులపై నిఘా కొనసాగుతోంది.

ఇప్పటికే 65 మంది అధికారులపై ప్రాథమిక స్థాయిలో సమాచారం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దృష్టిలో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాఖలు ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు కావడంతో లంచాలు, అక్రమ లావాదేవీలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గతంలో వచ్చిన ఆరోపణలు నిరూపించాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకున్నా అటవీ, పీసీబీ, మైనింగ్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లాంటి శాఖల్లో కూడా అవినీతి పెరిగిపోయిందని ఈ మధ్యకాలంలో ఈ శాఖల అధికారులపై కూడా ఏసీబీకి ఎక్కుగా ఫిర్యాదులు వస్తున్నాయి అని తెలుస్తుంది. పరిశ్రమలపై వచ్చే ఫిర్యాదులను ఆధారం చేసుకొని.. పరిశ్రమల్లో జరిగే ప్రమాదలను కూడా అవకాశంగా తీసుకోడమే కాకుండా.. అట్టి పరిశ్రమలకు జారీ ఇచ్చే అనుమతులలో కూడా ఈ శాఖల అధికారులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టరాని వీరిపైకూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఏసీబీ కి ఫిర్యాదులు ఎక్కువగా వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కేవలం ఫిర్యాదుల ఆధారంగా కాకుండా ఆరు నెలలుగా అనుమానిత అధికారుల ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. దీని కోసం వీడియో రికార్డింగ్ లు, డాక్యుమెంటరీ ఆధారాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే దాడులు, కేసుల నమోదు చేసే విధానాన్ని ఏసీబీ అనుసరిస్తోంది.

ఇటీవలి కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసిన ఏసీబీ ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. ఈ చర్యలు మిగతా అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి స్వేచ్చ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షలు కఠినంగా ఉంటేనే మిగతా అధికారులకు హెచ్చరికగా నిలుస్తాయని ప్రభుత్వ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు సమాచారం.

అవినీతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. లంచం డిమాండ్ చేసిన అధికారులు లేదా అక్రమాస్తులపై విశ్వసనీయ సమాచారం ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు తరచూ సూచిస్తున్నారు. అవినీతి కేసుల్లో దాడులు నిర్వహించడం ఒక దశ మాత్రమే. అనంతరం ఆస్తుల మూలాలను నిరూపించడం, కోర్టులో బలమైన సాక్ష్యాలను సమర్పించడం, చివరకు శిక్షలు పడేలా చేయడం మరింత కీలకమైన ప్రక్రియ. గతంలో కొన్ని కేసులు సాక్ష్యాల లేమితో బలహీనపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈసారి పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్లాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి ఓ రేటు చొప్పున లంచాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలని పరిస్థితి. అవినీతికి మరిగి ఎదుటి వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండటంతో ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్చ కల్పించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోలో అవినీతి ద్వారా భారీ మొత్తంలో అక్రమస్తులు కూడబెట్టిన వారిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత విడతల వారీగా ఒక్కో అవినీతి అధికారుల ఆస్తులపై దాడులు చేపట్టనున్నారు.