రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడండి

  • హైడ్రా ప్ర‌జావాణిలో మూసాపేట నివాసితులు ఫిర్యాదు
  • సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 42 ఫిర్యాదులు

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి – మూసాపేట గ్రామాల మ‌ధ్య ప్ర‌భుత్వ పాఠ‌శాల‌తో పాటు.. జిల్లాప‌రిషత్ హైస్కూల్ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 2 ఎక‌రాల‌ను కేటాయించింది. ఇక్క‌డ పాఠ‌శాల భ‌వ‌నాలు రాక‌పోవ‌డంతో క‌బ్జాల‌కు గురౌతున్నాయి. వెంట‌నే హైడ్రా రంగంలోకి దిగి కాపాడాల‌ని మూసాపేట నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. వాస్త‌వానికి కూక‌ట్‌ప‌ల్లి – మూసాపేట గ్రామాల మ‌ధ్య 10.18 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇందులో 4 ఎక‌రాల‌ను మంచినీటి శుద్ధి ప్లాంట్ కోసం జ‌ల‌మండ‌లికి రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. మిగిలిన 6 ఎక‌రాల్లో 2 ఎక‌రాల‌ను మండ‌ల ఎంపీపీఎస్ బాలురు స్కూలు, జ‌డ్‌పీహెచ్ ఎస్ బాలిక‌లు కోసం ఒక ఎక‌రం కేటాయించారు. ఈ మేర‌కు మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు కూడా ఉన్నాయి. స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి కూక‌ట్‌ప‌ల్లి మండ‌ల విద్యాశాఖ అధికారికి 2023లో అప్ప‌గించ‌డం జ‌రిగింది. అక్క‌డ భ‌వ‌నాలు నిర్మించ‌క‌పోవ‌డంతో అక్క‌డి రెండు ఎక‌రాల‌తో పాటు మిగిలిన 4.18 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా అక్క‌డ నిర్మాణాలు చేప‌డుతున్న ప‌లు సంస్థ‌లు క‌బ్జా చేసి షెడ్డులు వేసి ఆక్ర‌మ‌ణ‌లు మొద‌లు పెట్టార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించ‌డంలో ముందుండే హైడ్రా వెంట‌నే మొత్తం 6.18 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడి ఫెన్సింగ్ వేయాల‌ని కోరారు. మేడ్చ‌ల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 419లో రెడీమిక్స్ సెంట‌ర్‌ను పెట్టి మొత్తం వాతావ‌ర‌ణాన్ని కాలుష్యం చేస్తున్నారు. అక్క‌డే పాఠ‌శాల‌లు, నివాసాలున్నాయి. దీంతో తీవ్ర వాయు, శ‌బ్ధ కాలుష్యం జ‌రుగుతోంద‌ని మ‌రో ఫిర్యాదు అందింది. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు రాగా.. వాటిని హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ డి. ఆనంద్ కుమార్ గారు ప‌రిశీలించారు. వాటి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అంద‌జేశారు.

ఫిర్యాదులు ఇలా..
🔷రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం, కుంట్లూరు గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌రు 215 నుంచి 224 వ‌ర‌కూ భూదాన్‌/ప్ర‌భుత్వ భూములు దాదాపు 100 ఎక‌రాల‌కు ఉన్నాయి. ఇందులో కొంత ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌డా.. మ‌రి కొంత భూమిలో దాదాపు 60 ఎక‌రాల్లో 2015లో లే ఔట్ వేశారు. లే ఔట్‌లో ప్లాట్లు కొన్న‌వారు కొంత‌మంది ఇళ్లు క‌ట్టుకుని ఉండ‌గా.. అప్ప‌ట్లో వాటిని తొల‌గించారు. అయితే నాటి నుంచి క‌బ్జాల జోరందుకుంది. లే ఔట్‌లో ప్లాట్లు కొన్న‌వారికైనా ద‌క్కాలి లేదంటే ప్ర‌భుత్వానికైనా ఈ భూమి ఉండాలి కాని.. మ‌ధ్య‌లో క‌బ్జాలు పాల‌వ్వ‌డం స‌రికాద‌ని.. హైడ్రా రంగ‌ప్ర‌వేశం చేసి ఫెన్సింగ్ వేసి ఆ భూముల‌ను కాపాడాల‌ని కుంట్లూర్ గ్రామం పాప‌య్య‌గూడేం వాసులు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు.

🔷సంగారెడ్డి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం కొల్లూరు విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 192 నుంచి 199, 215, 216ల‌లోని దాదాపు 254.36 ఎక‌రాల్లో భ‌వాని న‌గ‌ర్ పేరిట 1980లో లే ఔట్ వేశారు. ఈ లే ఔట్లో ర‌హ‌దారులు, పార్కుల హ‌ద్దులు చెరిపేసి మొత్తం భూమిని ఆక్ర‌మించుకుంటున్నారు. హైడ్రా రంగంలోకి దిగి ఈ లే ఔట్‌కు ప్రాణం పోయాల‌ని భ‌వానీన‌గ‌ర్ లే ఔట్లోని ప్లాట్ల య‌జ‌మానులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

🔷రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం, మన్సూరాబాద్ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీకర్ సెక్షన్ కాలనీలో 1985 హుడా లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లేఅవుట్‌లో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించి, అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

🔷మహేశ్వరం మండలం, సర్దార్‌నగర్ గ్రామ పరిధిలోని పెద్ద చెరువు (ఐడీ–2404) ప్రిలిమినరీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వెలుపల ఉన్న భూముల్లో కృత్రిమంగా నీరు నిల్వ చేసి భూయజమానులు తమ స్థలాలకు వెళ్లకుండా పరిస్థితి కల్పించారని బాధితుడు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. సర్వే నంబర్లు 35–40, 47–54, 56–60, 62–70, 76, 77, 78, 79లోని భూములు ఎఫ్‌టీఎల్ పరిధిలో లేవని, అయినప్పటికీ ఐదేళ్లకు పైగా నీరు నిల్వ ఉండటంతో వినియోగానికి నోచుకోవడం లేదని తెలిపారు.

🔷నార్సింగి సర్కిల్ పరిధిలోని అరుణోదయ సొసైటీ హుడా లేఅవుట్‌లో సర్వే నంబర్లు 300–305, 308–311, 313–315లో 1991 హుడా లేఅవుట్ ప్రకారం నాలుగు పార్కుల కోసం కేటాయించిన 14,231 చదరపు గజాల స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు, డెవలప్‌మెంట్ ఒప్పందాలు, అనధికార అనుమతుల ద్వారా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. పార్కుల స్థలాలను కాపాడి, అక్రమ రిజిస్ట్రేషన్లు, మున్సిపల్ అనుమతులు రద్దు చేసి, కొనసాగుతున్న నిర్మాణాలను నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.