- తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా అవార్డుల పేరు, లోగో రూపకల్పన ఉండాలి
- పి.వి. నరసింహారావు పేరుతో వారసత్వ పురస్కారం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం
- • కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
- • పూర్తిస్థాయి పారదర్శకతతో అవార్డుల ఎంపిక జరగాలని కమిటీకి మంత్రి సూచన
- • తెలంగాణ భాష, సంస్కృతి, వారసత్వాన్ని చాటే కృతులకు ప్రత్యేక గుర్తింపు
- న్యూస్ చానల్స్ యాంకర్స్, ప్రజెంటర్స్ కు కూడా అవకాశం కల్పించాలి
- మొట్టమొదటిసారిగా ప్రదానం కానున్న తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులపై ప్రత్యేక శ్రద్ధ
హైదరాబాద్ : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులు (TGSTA)ను ప్రదానం చేయనున్నట్లు మంగళవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డుల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో అవార్డుల విధివిధానాలు, లోగో, అవార్డుల పేర్లు, కేటగిరీలు, అవార్డుల ప్రదానోత్సవ వేదిక తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద్ రెడ్డి, డైరెక్టర్ కిషోర్ బాబు, కమిటీ ఛైర్మన్, సభ్యులతో మంత్రి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ టెలివిజన్ రంగం సమాజంపై విశేష ప్రభావం చూపే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాలను అధికంగా వీక్షిస్తున్నారని పేర్కొన్నారు. మంచి సందేశాన్ని అందించే ధారావాహికలు, కార్యక్రమాలు, బాలల చిత్రాలు, సామాజిక స్పృహ కలిగిన కంటెంట్‌ను రూపొందించే వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెలివిజన్ నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు, దినసరి ధారావాహికలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రాధాన్యత గల చిత్రాలు, విద్యా చిత్రాలతో పాటు వివిధ సాంకేతిక, సృజనాత్మక విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్తమ దర్శకుడు, నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, యాంకర్లు, డబ్బింగ్ కళాకారులు, ఎడిటర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు తదితర విభాగాల్లో వ్యక్తిగత పురస్కారాలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. టెలివిజన్ నాన్-ఫిక్షన్ కార్యక్రమాలకు కనీసం 13 ఎపిసోడ్లు, దినసరి ధారావాహికలకు కనీసం 100 ఎపిసోడ్లు పూర్తి చేసి ఉండాలని మంత్రి తెలిపారు. బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక ప్రాధాన్యత గల మరియు విద్యా చిత్రాలు 20 నుంచి 60 నిమిషాల నిడివి కలిగి ఉండాలని పేర్కొన్నారు. న్యూస్ చానల్స్ లో యాంకర్స్, ప్రజెంటర్స్ ను(పురుషులు,మహిళలు) విభాగంలో అవార్డుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన జాబితాను అవార్డుల పరిశీలనకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. టీవీ రంగానికి చెందిన నిష్ణాతులైన కమిటీ చైర్మన్,సభ్యులు ఉన్నారు కాబట్టి ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని అన్నారు.
తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ప్రతిబింబించే టెలివిజన్ కృతులకు పి.వి. నరసింహారావు గారి పేరును అనుసంధానించే అంశాన్ని కమిటీ ప్రతిపాదించిందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టిన మహనీయుడు, బహుభాషా కోవిదుడు అయిన పి.వి. నరసింహారావు గారి పేరుకు తగిన గౌరవాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని, మొదటిసారిగా ప్రదానం చేయనున్న ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరగాలని కమిటీకి మంత్రి సూచించారు. వీలైనంత త్వరగా గైడ్‌లైన్స్, లోగో, అవార్డుల పేర్లకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి రెండు, మూడు ప్రత్యామ్నాయ వేదికలను ప్రతిపాదించాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద్ రెడ్డికి సూచించారు. అనంతరం ఈ అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ ఛైర్మన్ మర్రార్ శరత్, సభ్యులు డా. ఎం. వినోద్‌బాల, పి. బిందు నాయుడు, పి. మంజుల నాయుడు, ఎం. రూపా దేవి, సయ్యద్ మీర్, పి. కిరణ్ (జెమిని కిరణ్), కె. బాపినీడు చౌదరి (ఈటీవీ), ఎం. విజయ్ భగవాన్ (మాజీ డైరెక్టర్, డీడీకే, హైదరాబాద్), కె. సీతాదేవి, డా. అనుక్నూర్ గౌతమ్, మధు మహంకాళి, విష్వేందర్ రెడ్డి, ఎల్. త్రినాథ్ రావు పలువురు పాల్గొన్నారు.