- సచివాలయంలో ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమం
- 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యం
- రైతు – శాస్త్రవేత్త – అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానానికి దేశంలోనే తొలి డిజిటల్ వేదికను విజయవంతంగా నిర్వహిస్తున్నారని సిఎస్ కితాబు
- ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర
- తోటి రైతుల విజయగాథలను, రాష్ట్ర రైతంగానికి పరిచయం చేస్తున్న వేదిక
హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు మరియు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతునేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ విజయవంతంగా పూర్తవడానికి సహకరించిన రైతులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు అభినందనలు తెలిపారు. రైతులు నేరుగా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పొందేందుకు రైతునేస్తం ఒక అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతువేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకే వేదికపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. 2024 మార్చి 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన రైతునేస్తం కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం రైతుల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 24,85,581 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిలో 5,26,107 మంది మహిళా రైతులు ఉన్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలో 2,43,830 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మొత్తం 27.30 లక్షలకు పైగా రైతులు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. రైతువేదికలను డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి రైతులతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలను కలిపిన కార్యక్రమం దేశంలోనే ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే రైతునేస్తం ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు అదే సమయంలో శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు లభిస్తున్నాయని, దీనివల్ల పంటలకు నష్టం కలగకముందే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం రైతులకు లభిస్తోందని మంత్రి వివరించారు.
ప్రపంచంతో పోటీపడే వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అవసరమని మంత్రి అన్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతునేస్తం ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, జిల్లాల వారీగా అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు ఎల్-నినో ప్రభావం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం, రైతులు కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతును రాజుగా తీర్చిదిద్దడమే రైతునేస్తం కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి లభ్యత మరింత సవాలుగా మారే అవకాశాలు ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు పరిశీలించాలని సూచించారు. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి రైతే వెన్నెముక అని, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తేనే రైతు ఆదాయం పెరుగుతుందని అన్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం ప్రకారం గత వారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ, రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 10 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. అయితే ఈ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం లేదని చెప్పారు. కాబట్టి రైతులు ఈ వర్షాలను చూసి నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి వంటి పంటలను విస్తృతంగా సాగు చేయవద్దని సూచించారు.
భూగర్భ జలాల పరిస్థితిని జిల్లా, మండలాల వారీగా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సాధారణంగా జూలై నెలలో 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 150 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రైతు రామకృష్ణ మాట్లాడుతూ తక్కువ నీరు, తక్కువ ఎరువులతో అధిక ఆదాయం సాధించే శాస్త్రీయ పద్ధతులను రైతునేస్తం ద్వారా నేర్చుకుంటున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రాంరెడ్డి మాట్లాడుతూ తాను 80 ఏళ్ల వయస్సులోనూ వ్యవసాయం చేస్తున్నానని, రైతునేస్తం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదని చెప్పారు. రైతు – శాస్త్రవేత్తల మధ్య ప్రత్యక్ష సంభాషణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని, రైతునేస్తం ద్వారా లభిస్తున్న శాస్త్రీయ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతు లావణ్య మాట్లాడుతూ వర్షాధార పంటలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, కందులు, పెసలతో పాటు ఆవాలు, ధనియాలు వంటి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సీహెచ్ రామారావు మాట్లాడుతూ ఒకప్పుడు ప్రైవేట్ కండక్టర్‌గా పనిచేసిన తాను, తక్కువ నీటితో బోడ కాకర సాగు ప్రారంభించి ప్రస్తుతం 20 ఎకరాలకు విస్తరించానని తెలిపారు. రైతులు రైతునేస్తం కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు వల్లూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించానని, ప్రస్తుతం మంచి దిగుబడి, ఆదాయం వస్తోందని చెప్పారు. అడవి జంతువుల బెడద లేకుండా అన్ని పరిస్థితులను తట్టుకునే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల విచ్చలవిడి యూరియా వాడకం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నేస్తం కార్యక్రమం ఎంతో గొప్పదని, భూపాలపల్లి ప్రాంతంలోని రిమోట్ ప్రాంతాలకు కూడా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తల విలువైన సూచనలు చేరుకోగలుగుతున్నాయని ప్రశంసించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తాను కూడా తన ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని, మరో ఏడు ఎకరాలకు విస్తరిస్తానని తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ 2022లో ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించి ప్రస్తుతం 29 టన్నుల 210 కిలోల గెలల దిగుబడితో రూ.6.53 లక్షల ఆదాయం పొందానని తెలిపారు. అదనంగా ప్రభుత్వ సబ్సిడీగా రూ.2.84 లక్షలు లభించాయని, నాలుగు సంవత్సరాలు పూర్తికాకముందే నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందని చెప్పారు. ఒకప్పుడు ఈ పంటపై విమర్శలు చేసిన వారే ఇప్పుడు తనను ఆదర్శంగా తీసుకొని ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు 5 గురు ఆదర్శరైతులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది.