తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

  • స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు వీబీ జీ రామ్ జీలో ప‌నులు చేర్చండి…
  • కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915 ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో కృషి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం PMAY-G ను వినియోగించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇళ్లు నిర్మించుకోక‌పోవ‌డంతో, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు సీఎం తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌రగా తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ఎల్‌నినో నేప‌థ్యంలో విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో (వీబీ జీ రామ్ జీ) అద‌న‌పు ప‌నులు చేర్చాల‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్షాభావంతో ప‌నులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల‌కు జీవ‌నోపాధులు మెరుగుప‌ర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అద‌న‌పు ప‌నులను చ‌ట్టంలో చేర్చాల‌ని సీఎం కోరారు. రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కొండ ప్రాంతాల‌తో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కంద‌కాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ ర‌క్ష‌ణ‌కు కంద‌కాల నిర్మాణం, వ‌ర‌ద‌లు, ఇసుక మేట‌ల‌తో దెబ్బ‌తిన్న భూముల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు వీబీ జీ రామ్ జీలో చేప‌ట్టాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ స‌మ‌యంలో 90 రోజుల వరకు ప‌నులు చేసే అవ‌కాశం ఉండేద‌ని సీఎం తెలిపారు. వీబీ జీ రామ్ జీ లోనూ అందుకు అనుమ‌తి ఇప్పించాల‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇత‌ర ప‌నుల‌ను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి వెంట ఎంపీలు డాక్ట‌ర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు రామ‌కృష్ణారావు, సెక్ర‌ట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ ఉన్నారు.