- వరుస తనిఖీలతో దడ పుట్టిస్తున్న ఏసీబీ
- 43 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ఏసీబీ అధికారులు
- రెండో త్రైమాసికంలో అత్యధిక కేసులు
- 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు
- లంచావతారుల భరతం పడుతున్న ఏసీబీ అధికారులు
అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో 43 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశారు. ఈ సంవత్సరంలో కూడా రెండో త్రైమాసికంలో నమోదు చేసిన కేసులకన్నా ఈసారి ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశారు. వీటిలో 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు ఉండగా.. 34 ట్రాప్ కేసులు ఉండటం గమనార్హం. ఏసీబీ డీజీ చారు సిన్హా, డైరెక్టర్ అవినాష్ మహంతితో కలిసి విధుల నిర్వర్తనలో ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులను అందచేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్న వారితోపాటు ఏ పని చేసి పెట్టాలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్న అవినీతి ఉద్యోగులపై ఏసీబీ కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎలా జరపాలి, ఆధారాలు ఎలా సేకరించాలన్న దానిపై ఏసీబీ అధికారులకు కొంతకాలం క్రితం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఇది ఫలితాలను ఇస్తున్నది. అందుతున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగుతున్న అధికారులు అవినీతికి పాల్పడుతూ కోట్లకు కోట్లు పోగేసుకున్న వారి బండారం మొత్తాన్ని సేకరిస్తున్నారు. పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వేర్వేరు బృందాలుగా విడిపోయి సదరు అవినీతి అధికారుల నివాసంతో పాటు బినామీలుగా ఉన్న వారి బంధు మిత్రుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అక్రమాస్తులకు సంబంధించి పది కేసులు నమోదు చేసి కళ్లు చెదిరే ఆస్తులు, నగదు, బంగారు నగలను సీజ్ చేశారు.
లంచావతారుల భరతం పడుతున్న ఏసీబీ అధికారులు
ఏసీబీ అధికారులు లంచావతారుల భరతం పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎవరైనా లంచం అడిగితే సమాచారం ఇవ్వాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ 1064 అందరికీ కనిపించే లా డిస్ ప్లే చేస్తున్నారు. దాంతోపాటు వెబ్ సైట్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఏసీబీకి ఫిర్యాదులు చేస్తున్నారు. న్యాయమైన పని చేసి పెట్టడానికి కూడా కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదుల మేరకు వల పన్నుతున్న ఏసీబీ అధికారులు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఇలా 34 మందిని ట్రాప్ చేసి పట్టుకున్నారు.
అవినీతిపరుల భరతం పట్టడంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) రికార్డు సృష్టిస్తోంది. గత 43 ఏళ్ల చరిత్రను బద్దలుకొడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక కేసులు నమోదు చేయడం విశేషం. లంచం తీసుకుంటుండగా వలవేసి పట్టుకోవడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వారి గుట్టు ఏసీబీ రట్టు చేస్తుండటంతో అక్రమార్కులు హడలిపోతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 199 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతి మూడు రోజులకు రెండు చొప్పున నమోదవుతున్నాయి. 1961లో ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ ఏర్పాటవ్వగా నమోదైన కేసుల గణాంకాలు 1983 నుంచి అందుబాటులో ఉన్నాయి. 2013లో ఒక త్రైమాసికంలో అత్యధికంగా 64 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధికం కాగా.. ఆ రికార్డును బద్దలుకొడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం 77 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కాగా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసులు 35, ఆకస్మిక తనిఖీలు 25, ఇతరత్రా 7 కేసులు ఉన్నాయి. దీన్నిబట్టి ఏసీబీ ఏస్థాయిలో సోదాలు చేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
- అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. లంచం అడిగారంటూ ప్రతిరోజూ వచ్చే ఫిర్యాదుల్లో సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే రంగంలోకి దిగుతారు. వచ్చిన ఫిర్యాదుకు సరైన స్పందన లేకపోతే బాధితులు కూడా వెనక్కి తగ్గుతారు. అందుకే ప్రతి ఫిర్యాదుకు స్పందించేలా ప్రణాళిక రూపొందించారు.
- అక్రమార్కుల ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ తెరవెనుక భారీ కసరత్తే చేస్తోంది. తమ నిఘావ్యవస్థ ద్వారా పెద్ద చేపలేవో గుర్తిస్తోంది. తర్వాత వారి ఆస్తులు, బినామీల వివరాలను రహస్యంగా సేకరిస్తోంది. ఇలా ఒక్కొక్కరి ఆస్తుల అధ్యయనానికి ఐదారు నెలలు పడుతోంది. వీటన్నింటినీ సేకరించాక.. పక్కాగా తనిఖీలకు దిగుతోంది. అభినందనలు తెలిపిన డీజీ అంకితభావంతో పని చేస్తూ అక్రమార్కుల భరతం పడుతున్న అధికారులకు ఏసీబీ డీజీ చారు సిన్హా, డైరెక్టర్ అవినాష్ మహంతి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా పని చేయాలని సూచించారు. ప్రతిభ కనబరిచే అధికారులకు తగు గుర్తింపు.. శాఖాపరమైన ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… “1983 నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీగా కేసుల్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. ఈ రికార్డుకు కారణమైన అధికారులు అభినందనీయులు, అవినీతిపై పోరులో ఏసీబీ అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి” అని సూచించారు.