తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి)లో సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ డా. ప్రసన్న కుమార్ మూడు దశాబ్దాలపాటు సంస్థకు అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. పర్యావరణ అవగాహన, ప్రజా భాగస్వామ్యం, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. యూనిసెఫ్, యునెస్కో-జపాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, గ్రీన్ అంబాసడర్‌గా, ఎన్‌సీఈఆర్‌టి పాఠ్యాంశాల రూపకల్పన సభ్యుడిగా, ఆర్ఈసీ సభ్యుడిగా, ఎంసీఆర్హెచ్ఆర్డీ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణుడిగా ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. తన పనిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర కృషితో సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పదవీ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, ఆయన అనుభవం, మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా సంస్థకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఆయన పదవీ విరమణ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిజిపిసిబి అధికారులు, సహచరులు డా. ప్రసన్న కుమార్‌తో తమ అనుభవాలను పంచుకుని, ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. రఘు, ఇతర ఉన్నతాధికారులు మరియు టిజిపిసిబి సిబ్బంది పాల్గొన్నారు.