షేక్‌పేట‌లో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్

  • రెండు మూడు రోజుల్లో పూడిక‌ను తొల‌గించాలంటూ ఆదేశం

షేక్‌పేట‌లోని హ‌కీంషా విరాట్‌న‌గ‌ర్‌లో చెత్త పేరుకుపోయిన వ‌ర‌ద కాలువ‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. పెద్ద‌మొత్తంలో వ్య‌ర్థాలు పేరుకుపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అక్క‌డ స్థానిక అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ విష‌య‌మై సోమ‌వారం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంతో పాటు.. స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ నేరుగా నాలాను ప‌రిశీలించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. పై నుంచి పెద్ద‌మొత్తంలో చెత్త కొట్టుకు రావ‌డంతో పాటు.. చెత్త‌ను ఇష్టానుసారం కాలువ‌లో ప‌డేయ‌డంతో ఈ ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌ని హైడ్రా ఆర్.ఎఫ్.వో. జ‌య‌ప్ర‌కాష్, ఎస్.ఎఫ్.వో. చ‌ర‌ణ్‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌కు తెలిపారు. షేక్‌పేట ఓయూ కాల‌నీ, మారుతిన‌గ‌ర్‌, వివేకానంద‌న‌గర్‌, అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌, ఎంజీ న‌గ‌ర్‌, హ‌కీంషా విరాట్‌న‌గ‌ర్‌, బృందావ‌న్ కాల‌నీ వ‌ర‌కు వ‌ర‌ద కాలువ పొడుగునా సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి నిఘా ఉంచాల‌ని అధికారుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. చెత్త వేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోడానికి కూడా వెనుకాడ‌వ‌ద్ద‌న్నారు. స్థానికుల‌తో కూడా మాట్లాడి చెత్త వేయ‌కుండా ఇక్క‌డ కాల‌నీల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. వ‌ర‌ద కాలువ‌లోకి జేసీబీల‌ను దించి రెండు మూడు రోజుల్లో మొత్తం చెత్త‌ను తొల‌గించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు.