హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా.వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎఎస్ తో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటైజేషన్ పురోగతి, సంబంధిత అంశాలను సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా గైర్హాజరైన (Absent), నివాసం మార్చుకున్న (Shifted), మరణించిన (Dead), నకిలీ (Duplicate) ఓటర్ల (ASDD) జాబితాల పునఃపరిశీలన, విశ్లేషణ, No Mapping కేసులు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి కింది కీలక ఆదేశాలు జారీ చేశారు:
• ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని లోపాలను అత్యంత ఖచ్చితత్వంతో సరిదిద్దాలి.
• అన్ని ASDD కేసులను తుది నిర్ణయానికి ముందు పునఃపరిశీలించి, సరైన వర్గీకరణ చేయాలి. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా లేదా పొరపాటున తొలగించబడకుండా చర్యలు తీసుకోవాలి.
• లోపాలు గుర్తించిన సందర్భంలో Roll-back సదుపాయాన్ని వినియోగించి, రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలి.
• బూత్ లెవల్ అధికారుల (BLOs), బూత్ లెవల్ సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) ద్వారా క్షేత్రస్థాయి ధృవీకరణను మరింత బలోపేతం చేయాలి. నిర్లక్ష్యం గుర్తించిన చోట క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలి.
• బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs) సంతకాలతో సిద్ధం చేసి, వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి.
• 85 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి సంబంధించిన వ్యత్యాసాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు విభజించబడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే, జీహెచ్‌ఎంసీ కమిషనర్ & హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని పట్టణ జిల్లాల జిల్లా ఎన్నికల అధికారుల పురోగతిని ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించారు. No Mapping కేసులు, ASDD కేసులు, అసంగతతలు, సేకరించని ఎన్యూమరేషన్ ఫారాలు , ఇతర పెండింగ్ అంశాల పరిష్కారానికి సంబంధించి వారి కార్యాచరణ ప్రణాళికలను తెలుసుకుని, దోషరహిత ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎన్నికలు) శాఖ అదనపు కార్యదర్శి ఎన్. శంకర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి (ఎఫ్‌ఏసీ) జి.ఎస్. చారి, రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ & హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), నోడల్ అధికారులు, సంబంధిత సెక్షన్ అధికారులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ (ఐటీ) తదితరులు పాల్గొన్నారు.