హైడ్రాకు మ‌ద్ధ‌తుగా కొన‌సాగుతున్న ర్యాలీలు

  • పార్కులు, చెరువులు కాపాడిన హైడ్రాకు మ‌ద్ధ‌తు
  • ర్యాలీలు నిర్వ‌హించి హైడ్రాకు, ప్ర‌భుత్వానికి సంఘీభావం

చెరువులు, పార్కులు, నాలాల‌ను ప‌రిర‌క్షించ‌స్తున్న హైడ్రాకు మ‌ద్ధ‌తుగా న‌గ‌ర‌వ్యాప్తంగా ర్యాలీలు కొన‌సాగుతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నాయి. దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి న‌గ‌రంలోని ప‌లు కాల‌నీ సంక్షేమ సంఘాలు మ‌ద్ధ‌తుగా నిల‌స్తున్నాయి. హైడ్రా వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని గండిపేట మండ‌లం పుప్పాల‌గూడ – నార్సింగ్ స‌రిహ‌ద్దులోని 52.20 ఎక‌రాల చెరువును క‌బ్జా కాకుండా కాపాడిన హైడ్రాకు మ‌ద్ధ‌తుగా ప‌రిస‌ర కాల‌నీ వాసులు, గేటెడ్ క‌మ్యూనిటీ నివాసితులు, అపార్టుమెంట్ వాసులు పెద్ద‌యెత్తున ర్యాలీలు నిర్వ‌హించి స‌మావేశాలు ఏర్పాటు చేసి హైడ్రాకు మ‌ద్ధ‌తు తెలిపారు. ముష్కిన్ చెరువులో దాదాపు 35 ఎక‌రాల మేర క‌బ్జా చేసేయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఆక్ర‌మణ‌ల‌ను తొల‌గించి హైడ్రా మొత్తం చెరువును కాపాడింది. గ‌చ్చిబౌలిలోని జ‌నార్ద‌న హిల్స్ కాల‌నీలో ఆక్ర‌మ‌న‌ల‌కు గురైన వ‌ర‌ద కాలువ‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాకుండా.. ఆ కాలువ‌కు ఆనుకుని ఉన్న పార్కును కాపాడినందుకు ఆదివారం పెద్ద‌యెత్తున ర్యాలీ నిర్వ‌హించి మ‌ద్ధ‌తు తెలిపారు. ఇందులో సీనియ‌ర్ సిటిజ‌న్లు, మ‌హిళ‌లు, చిన్నారులు, యువ‌కులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొని హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంఘీభావం ప్ర‌క‌టించారు. న‌గ‌ర భ‌విష్య‌త్ బంగారంలా ఉండాలంటే హైడ్రా ఉండాల్సిందే అంటూ నిన‌దించారు. వ‌ర‌ద‌లు లేని న‌గ‌రం కావాల‌నుకుంటే చెరువుల‌ను కాపాడుకోవాల‌ని.. ఆ ప‌ని చేస్తున్న హైడ్రాకు మ‌ద్ధ‌తు తెలుపుతున్నామంటూ ప‌లువురు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.