ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, అర్చకులు మంత్రిగారికి డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మారు బోనం సమర్పణ కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సురేఖ గారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. బోనమెత్తిన మహిళలకు ఈ సందర్భంగా మంత్రి సురేఖ చీరె, సారె అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మారుబోనం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అమ్మవారికి సమర్పించిన బియ్యంతో మారు బోనం చేయడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారమని మంత్రి సురేఖ అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాలను ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాట్లకు తోడు ప్రజల సహకారంతో ఈ ఏడాది బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయన్నారు.