పేదల సొంతింటి కలకు కేంద్రం చేయూత: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి
  • తెలంగాణకు 11.56 లక్షల PMAY-G ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి.. తెలంగాణ పర్యటనకు కేంద్ర మంత్రికి ఆహ్వానం

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను ఒకేసారి కేటాయించాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎంపీలు డా. మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్ షెట్కార్, మండాది అనిల్‌కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి పొంగులేటి కలిశారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల గృహ అవసరాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ.పీ. గౌతమ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలనలో ఇళ్ల కోసం 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్ ప్లస్–2024 యాప్ ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించగా 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా గుర్తించబడ్డాయని చెప్పారు. సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. “అర్హులైన కుటుంబాల జాబితాను రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అనేక దఫాలుగా కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. స్వయంగా ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లోనూ రాష్ట్ర గృహ అవసరాలను ఆయన దృష్టికి తీసుకువచ్చాను” అని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో గత 12 ఏళ్లుగా పేదల గృహ నిర్మాణం నిలిచిపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడిందని, ఈ నేపథ్యంలో అర్హులైన 11,56,915 కుటుంబాలకు ఒకేసారి ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రాష్ట్ర సాయం
PMAY-G కింద కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు. “పేదలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. కేంద్రం నుంచి PMAY-G ఇళ్ల కేటాయింపు జరిగితే గ్రామీణ పేదల సొంతింటి కలను మరింత వేగంగా నెరవేర్చగలం” అని మంత్రి అన్నారు.

తెలంగాణ పర్యటనకు రావాలని ఆహ్వానం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణలో పర్యటించాల్సిందిగా మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. PMAY-G 2.0 కింద తెలంగాణకు ఇళ్ల కేటాయింపును స్వయంగా రాష్ట్రానికి వచ్చి ప్రకటిస్తే గ్రామీణ పేదలకు మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. కేంద్ర మంత్రి సానుకూల స్పందనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.