- అవగాహన, స్వచ్ఛంద పరీక్షలు, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స కీలకం
హైదరాబాద్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యక్తుల్లో స్వీయ ప్రమాద అంచనాను పెంపొందించి, స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ, సిఫిలిస్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు నిర్వహించనున్న ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక IEC (Information, Education and Communication) ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ, IAS; జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కన్నన్, IAS; రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్; సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి, IAS; ప్రముఖ సినీ కళాకారుడు తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం, ముందస్తుగా గుర్తించడం, సరైన వైద్య సలహాలు పొందడం, సకాలంలో చికిత్స తీసుకోవడం వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని మంత్రి సూచించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో అండగా నిలవాలని కోరారు.
భారీ అవగాహన ర్యాలీలు
ప్రచార కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ ప్రాంతంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 50కి పైగా బైక్‌లతో నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 25కి పైగా ఆటోలతో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీల్లో నర్సింగ్, వైద్య కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టుల సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వాక్‌థాన్‌లో 1,600 మందికి పైగా పాల్గొన్నారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు, తిరిగి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకు మొబైల్ ICTC వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు, వాక్‌థాన్‌లో పాల్గొన్న వారు హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణకు సంబంధించిన సందేశాలు, నినాదాలతో కూడిన ప్లకార్డులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ లోగో, QR కోడ్‌లతో కూడిన గొడుగులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెచ్‌ఐవీ, సిఫిలిస్ వ్యాప్తి ప్రమాదం ఉన్న వర్గాల్లో నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
హెచ్‌ఐవీ నివారణలో తెలంగాణ పురోగతి
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (TGSACS) ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు స్వాగతం పలికి, రాష్ట్రంలో హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్సకు సంబంధించి అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలపై వివరించారు.
2025-26 జాతీయ స్కోర్ కార్డులో తెలంగాణ 5వ స్థానాన్ని సాధించిందని, 2023లో ఉన్న 31వ స్థానం నుంచి గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.
హెచ్‌ఐవీ రహిత తెలంగాణకు సమష్టి కృషి
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలు, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స, చికిత్సను నిరంతరం కొనసాగించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ రహిత తెలంగాణ సాధించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహనతో వ్యాధిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రముఖ సినీ కళాకారుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ యువత హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీపై ప్రామాణిక సమాచారం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1097ను సంప్రదించాలని, అందుబాటులో ఉన్న హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స సేవలను ఎటువంటి సంకోచం లేకుండా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమం ముగింపులో TGSACS ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు, ప్రముఖులను సత్కరించారు. అనంతరం బెలూన్లను ప్రతీకాత్మకంగా విడుదల చేసి రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత IEC ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ప్రధాన ప్రచార సందేశం
• “Be Positive to Prevent HIV Positive.”
• మీ ప్రమాదాన్ని తెలుసుకోండి – అవగాహన పొందండి – పరీక్ష చేయించుకోండి – హెచ్‌ఐవీ, సిఫిలిస్‌ను నివారించండి.
• ఎయిడ్స్ రహిత తెలంగాణ సాధనకు ప్రభుత్వం, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సమష్టిగా కృషి చేయాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.