- వచ్చే ఏడాది ఇందిరమ్మ టవర్స్ నుంచే బోనాలు ఎత్తిస్తాం
- ఎటువంటి లాలూచీ లేకుండా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన చేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గురువారం సాయంత్రం కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం కమిషన్లు రావన్న కారణంగా పేదలకు ఇళ్ళు కట్టలేదని, కమిషన్లు వచ్చే కాలేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఎకరా 200 కోట్ల రూపాయల వరకు ఉన్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో పెద్ద పెద్ద టవర్స్ పక్కనే పేదలకు కూడా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి ఆచరణలోకి తెచ్చిందన్నారు. హస్తం పార్టీ రాష్ట్ర ప్రజలకు నేస్తమని మంత్రి గుర్తుచేస్తూ ఈ ప్రభుత్వం తల తాకట్టు పెట్టి అయినా పేదలకు ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా చేపడుతుందన్నారు. తొలివిడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించామని దీనికి సంబంధించి ఇప్పటి వరకు 51 వేల దరఖాస్తులు వచ్చాయని, మరో రెండు రోజుల్లో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగుస్తుందని అన్నారు. ఆ కార్యక్రమం తర్వాత అందరి సమక్షంలో ఎటువంటి లాలూచీలు లేకుండా పారదర్శకంగా మంత్రులతో సైతం ఎవరి సిఫార్సులు లేకుండా అందరి ముందు లక్కి డిప్ తీసి ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ముందే ఇళ్ల వివరాలను అందిస్తాం కాబట్టి వారు దగ్గరుండి కాంట్రాక్టర్ తో నాణ్యంగా తమ ఇళ్ళను కట్టించుకోవచ్చునని సూచించారు .ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వ పాలకులు జీర్ణించుకోలేక కక్షపూరితంగా గుడ్డ కాల్చి నెత్తిన వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే మరో రెండున్నర ఇళ్లలో మూడింతలు ఎక్కువగా ఇళ్లు నిర్మిస్తామని ,అది చేయకపోతే తాను శాసనసభకు పోటీ చేయనని మరోసారి మంత్రి పొంగులేటి ప్రకటించారు. గతంలోనే ఈ ఛాలెంజ్ విసిరినప్పటికీ కిండర్ కింగ్ దీన్ని స్వీకరించలేదని, ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. అంతేగాక సొల్లు పురాణం సొల్లు కథలు చెబుతూ పేదలను పేదల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని అవి ప్రభుత్వ భూములు కాకపోతే రెండు రోజుల్లోనే ఆ భూములపై నిషేధం తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు