- ప్రజలకు జవాబుదారులు అధికారులు
- అంకిత భావంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి
- సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని ఎం.పీ.డీ.వో.లు నిలబెట్టుకోవాలి
- రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
ప్రజలకు జవాబుదారులం అనే విషయాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోల ( 560 మంది ) శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల నుంచి వచ్చే ప్రజలతో ఓపికగా మాట్లాడి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే గురుతర బాధ్యత మండల నోడల్ అధికారి, వివిధ శాఖల మండల అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్ళని వారికి సేవలు అందించడం అధికారుల కనీస బాధ్యత అని చిన్నారెడ్డి గుర్తు చేశారు. ఎంపీడీవో లకు మండల ప్రజావాణి నోడల్ అధికారిగా ఎంతో నమ్మకంగా నియమించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వారు నిలుపుకోవాలని, ప్రజావాణి ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజావాణి పేదవారి సమస్యల పరిష్కార వేదికగా మారాలని ఆయన అన్నారు.
రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి 75% సక్సెస్ రేటును సాధించిందని, ఇదే స్థాయిలో సమస్యలకు పరిష్కరిస్తూ జిల్లా, మండల స్థాయి ప్రజావాణి అదుకారులు కృషి చేయాలని చిన్నారెడ్డి సూచించారు. మండల స్థాయి ప్రజావాణిలో బాధ్యతలు నిర్వహించే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా ప్రారంభం కానున్న మండల స్థాయి ప్రజావాణి కార్యమాలకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని చిన్నారెడ్డి సూచించారు. సీఎం ప్రజావాణి మాదిరిగానే మండల స్థాయిలోనూ శాఖల వారీగా డెస్క్ లు, ప్రజల దరఖాస్తులు రాసేందుకు హెల్ప్ డెస్క్ లు, వైద్య సేవలు, తాగు నీరు ఏర్పాట్లు చేసుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చిన్నారెడ్డి అన్నారు. స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలు మాస్టర్స్ అని, అధికారులు సేవకులు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రజావాణి బాధ్యులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అధికారులు పబ్లిక్ సర్వేంట్స్ అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించవద్దని అన్నారు. మండల, జిల్లా నోడల్ అదుకారులు ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడం కర్తవ్యంగా భావించాలని విద్యాసాగర్ సూచించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజావాణి వ్యవహారాల పర్యవేక్షకులు, సీఎం ఓ.ఎస్.డీ. వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో ప్రజావాణికి వచ్చే ప్రజలకు సాంత్వన కల్పించాలని రాష్ట్రంలోని ఎంపీడీవో లకు సూచించారు. మండల నోడల్ అధికారి, మిగతా శాఖల అధికారులు ప్రజల విశ్వాసాన్ని చురగొనాలని వేముల శ్రీనివాసులు పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలను ఓపికగా వింటే సగం సమస్య పరిష్కారం అయినట్లేనని, సమస్యల పరిష్కారం కోసం గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు తీసుకోవాల్సిన అనేక అంశాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, సీఎం ప్రజావాణి ఏ.సీ.పీ. ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారి సుశీల, సీఎం ప్రజావాణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.