మహనీయుల స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పూలే దంపతుల ఆశయాల సాధనకు కంకణబద్ధులై పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం
  • ​దేశానికే ఆదర్శంగా తెలంగాణలో శాస్త్రీయంగా కులగణన
  • ​రాష్ట్రంలో 56 శాతం మేర ఉన్న బడుగు, బలహీన వర్గాలు
  • ​ఏడాదిలోనే 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
  • విద్యా, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పూలే ఆలోచనలను అమలు చేస్తున్నాం
  • నెక్లెస్ రోడ్‌లో పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పూలే దంపతుల ఆశయాల సాధనకు కంకణబద్ధులై పని చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ​సామాజిక అసమానతలను పారద్రోలి, అనగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేసిన మహానుభావులు పూలే దంపతులని ఆయన కొనియాడారు. వారి విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. ఈ విగ్రహాల ఆవిష్కరణ ద్వారా బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న స్పష్టమైన సందేశాన్ని  ఇచ్చామన్నారు. పూలే ఆశయాలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేస్తున్న ఏకైక ప్రజా ప్రభుత్వం తమదేనని ఆయన ఉద్ఘాటించారు.


బీసీల రిజర్వేషన్ల అమలుకు శాస్త్రీయమైన గణాంకాలు అవసరమని గతంలో అనేకసార్లు న్యాయస్థానాలు చెప్పినప్పటికీ, గతంలో ఏ ప్రభుత్వమూ ఆ సాహసం చేయలేదన్నారు. కానీ, దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో శాస్త్రీయంగా కులగణన (సోషియో, ఎకనామిక్, పొలిటికల్ సర్వే) చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో బలహీన వర్గాలు 56 శాతం ఉన్నారని తేల్చామని, ఈ శాస్త్రీయ గణాంకాల ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను కేవలం 300 మందికే ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ సంఖ్యను 700లకు పెంచినట్లు  తెలిపారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని సభలో ఆర్. కృష్ణయ్య ప్రస్తావించిన అంశంపై ఆయన స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఏడాది కాలంలోనే ఒక్కో భవనానికి రూ. 200 కోట్లు కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లుగా.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ​మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకునేది వారి మార్గంలో ప్రయాణించి, వారు చెప్పిన సిద్ధాంతాలను అమలు చేసేందుకు స్ఫూర్తి పొందడానికేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆ మహానుభావుల స్ఫూర్తి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని, వారి విగ్రహావిష్కరణలో పాలుపంచుకునే అవకాశం రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.