- ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన వివిధ వృత్తిదారులు
- హైడ్రా కమిషనర్‌ను కలిసిన పలువురు వృత్తి నిపుణులు
గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి వరదలు లేని నగరమే లక్ష్యంగా హైడ్రాను దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు మద్ధతు పలికారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేసి చెరువులు, వరద కాలువలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంతో పాటు.. శివారు ప్రాంతాలకు చెందిన వివిధ వృత్తి నిపుణులు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని కలిసి హైడ్రా కార్యకలాపాలకు మద్ధతు పలికారు. పలువురు న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు.. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఇలా వివిధ వృత్తుల్లో సేవలందిస్తున్నవారు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులను చూస్తే ఎంతో ముచ్చటేస్తోందన్నారు. నగరంలో చెరువులన్నీ ఇదే మాదిరి ఇన్లెట్లు, ఔట్లెట్లతో అభివృద్ధి జరిగితే చాలా వరకు వరదలను నియంత్రించ వచ్చునన్నారు. చెరువుల చెంత హైడ్రా అభివృద్ధి చేస్తున్న గ్రీనరీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికతో భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి గతంలో ఉండేదని.. ఇప్పుడు పూడికను పూర్తిగా తొలగించి చెరువులను అభివృద్ధి చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన కొద్డిపాటి వర్షాలకే చెరువుల్లో నీరుచేరి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయన్నారు. జలవనరులను కాపాడితే ప్రకృతి పరిరక్షణకు వెసులుబాటుంటుందని.. ఆ దిశగా హైడ్రా చర్యలు అభినందనీయమన్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలు కాకుండా చూడడం సామాన్యమైన విషయం కాదని పలువురు పేర్కొన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడిందని.. ఇదే విధంగా పని చేసి చక్కటి వాతావరణం ఉండేలా చూడాలని కోరారు.