- సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వ పాలన
- పేద, బలహీన వర్గాలు ‘దేహీ’ అనకుండా ఆత్మగౌరవంతో బతికేలా సంక్షేమం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సచివాలయం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదని, అణచివేతను అసలే సహించదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలోనే అణచివేతపై తిరుగుబాటు చేసి, బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటను సాధించిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన బాటలోనే నేటి ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట, ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాన్యులు సైతం కలలు కనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని నాడే సర్వాయి పాపన్న నిరూపించారని భట్టి విక్రమార్క కొనియాడారు. ‘కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి’ అనే లక్ష్యంతో చిన్న చిన్న కోటలను గెలుచుకుంటూ ముందుకు సాగిన గొప్ప ధీరుడని, ఆయన ఆత్మగౌరవ పోరాటం మనందరికీ నిత్య స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, ఇటీవలే నెక్లెస్ రోడ్‌లో సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించుకున్నామని గుర్తుచేశారు.
ఈ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరి దగ్గరా ‘దేహీ’ అని అడగకుండా, స్వశక్తితో తల ఎత్తుకొని బతికేలా ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం తెలిపారు. అందులో భాగంగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కోటి 6 లక్షల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నట్లు వివరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నామని, కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ధీమానిచ్చేలా రూ.5 లక్షల పరిహారంతో ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పూలే, సర్వాయి పాపన్న వంటి మహనీయుల ఆలోచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామని, బహుజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
