- ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా మరియు సంక్షేమ విధివిధానాలపై కీలక సమీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (G.O.Rt.No.679) చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నేడు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మరియు మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీలతో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించిన “చర్చలపై ఒక ముసాయిదా నోట్” పై ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు.
ఉద్యమకారుల వర్గీకరణ (కేటగిరీల విభజన) ముసాయిదా పరిశీలన:
సేకరించిన క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం ఉద్యమకారులను క్రింది గ్రూపులుగా గుర్తించే విధానాన్ని కమిటీ ప్రాథమికంగా పరిశీలించింది:
- మొదటి కేటగిరీ (అమరుల కుటుంబాలు): ఉద్యమ క్రమంలో అమరులైన వారు (సుమారు 1400 మంది వరకు సమాచారం ఉండగా, గతంలో కొందరికి మాత్రమే సహాయం అందింది). మిగిలిన అర్హులైన అమరుల కుటుంబాలను గుర్తించి పూర్తి న్యాయం చేయడం.
- రెండవ కేటగిరీ (గాయపడిన ఉద్యమకారులు): పోలీసు కాల్పుల్లో, లాఠీచార్జీల్లో శాశ్వత అంగవైకల్యం పొందిన వారు మరియు ఆత్మహత్యాయత్నాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు.
- మూడవ కేటగిరీ (జైలు జీవితం గడిపిన వారు): తొలిదశ (1969), మలిదశ ఉద్యమాల్లో ప్రివెంటివ్ కస్టడీ, రిమాండ్, తీవ్ర జైలు శిక్షలు అనుభవించిన విద్యార్థులు, ఉద్యమకారులు.
- నాల్గవ కేటగిరీ (కేసులు నమోదైన వారు): నాటి ఉద్యమ సమయంలో క్రిమినల్ కేసులు, బెయిలబుల్/నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొన్న శ్రేణులు.
- ప్రత్యేక కేటగిరీలు (సంస్థాగత & క్రియాశీలక శ్రేణులు): కేసులు నమోదు కానప్పటికీ.. ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూమ్-ధామ్ కళాకారులు మరియు వివిధ సంస్థల సభ్యులు.
ఉద్యమకారుల ఆకాంక్షలు — సంక్షేమ అభ్యర్థనలు: - సత్కారం – సహాయం – సహకారం: ఉద్యమకారులకు ఈ మూడు విధానాల్లో గౌరవం దక్కాలని కమిటీ స్పష్టం చేసింది.
- గుర్తింపు కార్డులు & గౌరవ ప్రదానం: ఉద్యోగులు మరియు వసతి కలిగిన వారు కేవలం ‘గుర్తింపు కార్డు / ప్రశంసా పత్రం’ ఆశిస్తుండగా.. నిరుపేద, నిరుద్యోగ యువత 250 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు కోరుతున్నారు.
- చట్టబద్ధత & కార్పొరేషన్: జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో సంక్షేమ పథకాలకు పూర్తి చట్టబద్ధత కల్పించడంతో పాటు శాశ్వత కమిషన్ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కమిటీ తక్షణ కార్యాచరణ నిర్ణయాలు: సమీక్ష అనంతరం చైర్మన్ కేకే గారు మరియు కమిటీ సభ్యులు తదుపరి చేపట్టవలసిన చర్యలను ఖరారు చేశారు: - ఉద్యమకారులు దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే అధికారిక వెబ్సైట్ / పోర్టల్ ద్వారా అవకాశం కల్పించడం.
- పారదర్శకమైన ఆన్లైన్ దరఖాస్తు నమూనాను సిద్ధం చేయడం.
- శాసనసభ్యులు (MLAs), శాసనమండలి సభ్యులతో (MLCs) విస్తృత స్థాయి చర్చలు జరపడం.
- మిగిలి ఉన్న ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులతో సంభాషణలు పూర్తి చేయడం.
- ఇప్పటివరకు జరిగిన అన్ని చర్చల సమగ్ర నివేదికను, మినిట్స్‌ను రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి సమర్పించడం.