- వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, సౌర విద్యుదీకరణకు ప్రాధాన్యత
హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి ఐఏఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్పో–2026 లో భాగంగా బుధవారం నిర్వహించిన గ్రామీణ భారతదేశానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, విశ్వసనీయ విద్యుత్ మరియు సమ్మిళిత అభివృద్ధి అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో డా. బి. గోపి ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, సౌర విద్యుదీకరణ తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. వివిధ పంటలకు నీటి అవసరం భిన్నంగా ఉంటుందని, తద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం కూడా పంటను బట్టి మారుతుందని తెలిపారు. అయితే ప్రస్తుతం అధికంగా ఒకే పంటను సాగు చేసే ఒకే రకమైన పంట విధానం (Monocropping Pattern)వైపు వ్యవసాయం సాగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల వైవిధ్యీకరణను (Crop Diversification) ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. తక్కువ నీటి అవసరమున్న, రైతులకు లాభదాయకమైన పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటిపై, వ్యవసాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వివరించారు.
సాగు విస్తీర్ణంలో గణనీయమైన వృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 1.31 కోట్ల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం అది సుమారు 2.2 కోట్ల ఎకరాలకు చేరుకుందని డా. గోపి తెలిపారు. అంటే గత దశాబ్ద కాలంలో సాగు విస్తీర్ణం సుమారు 70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా, 2014తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మూడు రెట్లకు పైగా పెరిగిందని తెలిపారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులు, విద్యుత్ వినియోగంపై ఒత్తిడిని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తూ తదనుగుణంగా వ్యవసాయ శాఖ తక్కువ నీటితో పండే మినుము పెసర వంటి పప్పు జాతి పంటలతో పాటుగా కూరగాయ పంటలు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే విధంగా విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు
సూక్ష్మ నీటిపారుదలతో నీరు, విద్యుత్ ఆదా
రాష్ట్రంలో సూక్ష్మ నీటిపారుదల (Micro Irrigation)విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని డా. గోపి తెలిపారు. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో సూక్ష్మ నీటిపారుదల విధానాలను అమలు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. క్షేత్రస్థాయిలో సూక్ష్మ నీటిపారుదల విధానాలకు రైతుల నుంచి మంచి డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు.
రైతులు విద్యుత్ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారులుగా
వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ రంగంలో సౌర విద్యుదీకరణ (Solarisation)ను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని డా. గోపి అన్నారు. రైతులు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా, భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిదారులుగా కూడా మారేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా అవసరమైన మూలధన పెట్టుబడికి సహకారం అందించడంతో పాటు, రైతులకు అనుకూలమైన విధానాలను రూపొందించి సమర్థవంతమైన వ్యవస్థను ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సూచించారు.
రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యంతో సౌర విద్యుదీకరణ
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) వంటి సంస్థలను సౌర విద్యుదీకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేయవచ్చని డా. గోపి పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని ఫీడర్ స్థాయిలో విభజించి (Feeder-level Segregation)పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. ప్రతి క్లస్టర్ స్థాయిలో స్వయం సమృద్ధి (Cluster-level Self-sufficiency)సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యంతో సౌర విద్యుదీకరణ, పంటల వైవిధ్యీకరణ, నీటి మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయవచ్చని తెలిపారు.
సమన్వయంతో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి
పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ, రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యం**—ఈ నాలుగు అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కూడా కల్పించవచ్చని డా. బి. గోపి పేర్కొన్నారు. నీరు–విద్యుత్–వ్యవసాయ రంగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా వనరుల సమర్థ వినియోగంతో పాటు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించవచ్చని ఆయన తెలిపారు.