ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు (అనామలిస్), నో-మ్యాపింగ్ కేసులతోపాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ, పోలింగ్ కేంద్రాలవారీగా సమయానుకూల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026 ప్రక్రియపై బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అదనపు సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జీఎస్ చారిలతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవోలు), నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణల ఆధారంగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిషరించాలని సూచించారు.