హెజేలో ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు..

  • ఇద్దరు కార్మికుల మృతి. మరో ఇద్దరి పరిస్థితి విషమం.. మరో 12 మందికి గాయాలు
  • రియాక్టర్‌ పేలడంతో పరిశ్రమలో విధ్వంసం..
  • కాలిన గాయాలతో కార్మికుల హాహాకారాలు
  • గతంలోనూ ఇదే పరిశ్రమలో ప్రమాదం
  • మూడు నెలల వ్యవధిలో కంపెనీలో రెండోసారి పేలిన రియాక్టర్
  • దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు వ్యాపించిన రసాయనాల ఘాటు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ డివిజన్‌లోని భూదాన్‌ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల సమీపంలో ఉన్న హెజేలో ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రియాక్టర్‌ ఒక్కసారిగా పేలడంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్‌ వద్ద రాత్రి షిఫ్ట్‌లో కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. చాలా మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే పరిశ్రమలో మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. లోపలికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొంది.

గతంలోనూ ఇదే పరిశ్రమలో ప్రమాదం

హెజేలో ల్యాబొరేటరీప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గతంలోనూ రియాక్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో పరిశ్రమ మేనేజర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే తరహా ప్రమాదం జరగడంతో పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తులు చేపట్టడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నప్పటికీ అధికారికంగా మృతుల సంఖ్య నిర్ధారణ కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.