మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యునిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. టీచింగ్ హాస్పిటళ్లతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉందని మంత్రి పేర్కొన్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే.. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో 1616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేశామని మంత్రి గుర్తు చేశారు. డాక్టర్లు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (DSH) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు, వైద్య సేవలు, మౌలిక వసతులు, మానవ వనరులు, పరికరాలు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DCHSలు), సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అవసరమైతేనే రిఫర్ చేయాలి
చిన్న చిన్న సమస్యలకు కూడా పేషెంట్లను పెద్ద హాస్పిటళ్లకు రిఫర్ చేసి ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి మారాలని మంత్రి అన్నారు. ఇప్పటికే చాలా హాస్పిటళ్లలో ఆ మార్పు వచ్చిందని, ఇంకా కొన్ని హాస్పిటళ్లలో అదే పరిస్థితి ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సరైన కారణం ఉంటే తప్ప పేషెంట్లను రిఫర్ చేయొద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మరో హాస్పిటల్‌కు రిఫర్ చేయాల్సి వస్తే, ముందుగానే ఆ హాస్పిటల్‌కు సమాచారం అందించి, అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా అందించగల వైద్య సేవలను అందించకుండా పేషెంట్లను పైస్థాయి హాస్పిటళ్లకు పంపడం వల్ల పేషెంట్లపై అదనపు భారం పడటంతో పాటు, టెర్షియరీ హాస్పిటళ్లపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది, బెడ్లు, పరికరాలు, డయాగ్నస్టిక్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా డీసీహెచ్‌ఎస్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమున్న చోట కొత్త సీటీ స్కాన్లు
ప్రభుత్వ హాస్పిటళ్లలో అవసరమైన వైద్య, డయాగ్నస్టిక్ పరికరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. అవసరం ఉన్న హాస్పిటళ్లలో కొత్త సీటీ స్కాన్లు, ఇతర డయాగ్నస్టిక్, వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్ఎస్లను మంత్రి ఆదేశించారు. అయితే పరికరాల కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడు కేవలం డిమాండ్ చేయకుండా, రోగుల సంఖ్య, అవసరం, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, వినియోగ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా స్పష్టమైన జస్టిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.
వారానికి కనీసం ఒకరోజు హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు
డీసీహెచ్‌ఎస్‌లు కేవలం కార్యాలయాల్లో కూర్చుని నివేదికలు పరిశీలిస్తే సరిపోదని మంత్రి స్పష్టం చేశారు. తమ పరిధిలోని ప్రతి హాస్పిటల్‌ను వారానికి కనీసం ఒకరోజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతున్నారా? పేషెంట్లకు సకాలంలో వైద్యం అందుతోందా? పరికరాలు పనిచేస్తున్నాయా? టెస్టులు, స్కాన్లు అందుబాటులో ఉన్నాయా? మందుల పరిస్థితి ఏమిటి? పరిశుభ్రత, తాగునీరు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతున్నాయా? వంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. డీసీహెచ్ఎస్ ప్రతి నెలా తమ వర్క్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించాలని మంత్రి ఆదేశించారు.
విధులకు గైర్హాజరు, ముందే వెళ్లిపోతే చర్యలు
హాస్పిటళ్లలో విధులకు గైర్హాజరవడం, నిర్ణీత సమయం కంటే ముందే హాస్పిటల్ నుంచి వెళ్లిపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు గుర్తిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేషెంట్లకు అందాల్సిన సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి లోటు రాకూడదని, సమయపాలన, బాధ్యత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
సమస్యలు గుర్తించి.. సకాలంలో పరిష్కరించాలి
హాస్పిటళ్లలో సమస్యలు పెద్దవిగా మారే వరకు వేచి చూడకుండా ముందుగానే గుర్తించి పరిష్కరించాలని మంత్రి అన్నారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సమస్యలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇతర శాఖల సమన్వయం అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు.