- హైదరాబాద్‌లో లాంఛనంగా ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ప్రారంభం
- జర్నలిజం కేవలం వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత
- ఖర్గే సభ తర్వాత జరిగిన శుద్ధీకరణ గురించి ప్రశ్నించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్‌ల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ద హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంగీత బారోచ్, కరవన్ పత్రిక ఎడిటర్ అనంతనాథ్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ నుంచి గౌతమ్ లాహిరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారతీయ జర్నలిజం వారసత్వాన్ని, ప్రస్తుత సవాళ్లను ఆయన సోదాహరణంగా వివరించారు. వివక్షను ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికలదే అని చెప్పారు. సమాజంలో జరుగుతున్న ఘటనలను కేవలం రిపోర్ట్ చేయడమే కాకుండా, వాటి అంతరార్థాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత జర్నలిజంపై ఉందని భట్టి స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ప్రసంగించిన రెండు రోజుల తర్వాత, కొందరు అక్కడ ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పట్ల బహిరంగంగా ఇలా జరిగితే… దేశంలో సమానత్వం, గౌరవం ఏ స్థాయిలో ఉన్నాయో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో మనం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఈ ఘటన తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయోద్యమంలో పత్రికలది చెరగని ముద్ర
భారతదేశ నిర్మాణంలో జర్నలిజం ఒక అంతర్భాగమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడం కాదని, పౌరులను తీర్చిదిద్దడమని ఆయన చెప్పారు. పేర్కొన్నారు. యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ పత్రికల ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ ప్రజలను స్వాతంత్ర్యోద్యమం వైపు మళ్లించారని అన్నారు.
మూక్ నాయక్, బహిష్కృత భారత్ వంటి పత్రికలను బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించి అణగారిన వర్గాలకు గొంతుకనిచ్చారని అన్నారు. కేసరి, మరాఠా పత్రికల ద్వారా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వలస పాలకులను సవాలు చేశారని అన్నారు. దాదాభాయ్ నౌరోజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారంతా పత్రికలను సామాజిక, రాజకీయ సంస్కరణలకు ఆయుధాలుగా మలిచారని ఆయన కొనియాడారు. ఆ కాలంలో అమృత బజార్ పత్రిక, ది హిందూ వంటివి ప్రజల గొంతుకలుగా నిలిచాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పాలకులకు, పత్రికలకు మధ్య ఉండాల్సిన సంబంధాన్ని ఒక చారిత్రక సంఘటనతో ఉపముఖ్యమంత్రి వివరించారు. 1948లో ‘శంకర్స్ వీక్లీ’లో తనను నిరంతరం కార్టూన్లతో విమర్శించే శంకర్‌తో అప్పటి ప్రధాని నెహ్రూ “నన్ను కూడా విడిచిపెట్టవద్దు, శంకర్” అన్న మాటలను భట్టి గుర్తుచేశారు. ఒకప్పుడు పత్రికా సంపాదకుడి పదవికి దేశంలో రెండో అత్యంత ముఖ్యమైన స్థానం ఉండేదని, రామ్‌నాథ్ గోయెంకా లాంటి యజమానులు ప్రభుత్వాలను సైతం సవాలు చేసేవారని ఆయన అన్నారు. నేటి వార్తా సంస్థలు కేవలం బ్యాలెన్స్ షీట్లకు, వాణిజ్య ప్రయోజనాలకు పరిమితం కాకుండా ఆనాటి విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
డిజిటల్ యుగంలో ‘విశ్వసనీయతే’ ఆయుధం
సోషల్ మీడియా భావప్రకటనా స్వేచ్ఛను విస్తృతం చేసినప్పటికీ, స్వేచ్ఛ అంటే బాధ్యతారాహిత్యం కాదని ఆయన హితవు పలికారు. “నా పిడికిలిని ఊపే హక్కు, అది నీ ముక్కు వద్దకు చేరే వరకు మాత్రమే” అన్న సామెతను గుర్తు చేస్తూ… ఒకరి ప్రతిష్టను దెబ్బతీసే లైసెన్స్‌గా భావప్రకటనా స్వేచ్ఛ మారకూడదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ క్లోనింగ్ వంటి సాంకేతికతలతో పుకార్లు దేశమంతా వ్యాపిస్తున్న ఈ కాలంలో… జర్నలిస్టులకు అసలైన ఆస్తి ‘విశ్వసనీయత’ మాత్రమేనని ఉద్ఘాటించారు.
జిల్లా రిపోర్టర్ల రక్షణే ముఖ్యం
కొత్తగా ఏర్పాటైన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ కేవలం ఒక సంస్థగా మిగిలిపోకుండా, జర్నలిస్టుల భద్రతను, వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడే బలమైన వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గ్రామీణ స్థాయిలో, జిల్లాల్లో పనిచేసే రిపోర్టర్ల సంక్షేమంపై ఫెడరేషన్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో టీచర్ లేకపోయినా, ఆసుపత్రిలో డాక్టర్ లేకపోయినా, పౌరులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వానికి ముందుగా తెలిసేది జిల్లా రిపోర్టర్ల ద్వారానే అని, వారే ప్రభుత్వానికి ‘అత్యుత్తమ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (Early Warning System)’ అని ఆయన కొనియాడారు.
తెలంగాణ గడ్డపై స్వేచ్ఛకు పెద్దపీట
మనసులోని మాటను నిర్భయంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ తెలంగాణ గడ్డ స్వభావంలోనే ఉందని, తమ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా గౌరవిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నెహ్రూ చెప్పినట్లుగానే “మమ్మల్ని కూడా విడిచిపెట్టవద్దు.. స్వేచ్ఛగా మాట్లాడండి, స్వేచ్ఛగా ప్రశ్నించండి. ఆ విమర్శలను వినే ధైర్యం అధికారంలో ఉన్న మాకు ఉంది” అని ఆయన జర్నలిస్టులకు భరోసా ఇచ్చారని అన్నారు. ఈ కాలంలో సమాచార కొరత లేదు.. నమ్మకం కొరత ఉంది. అందరూ ప్రచురించగలిగే పరిస్థితుల్లో జర్నలిస్టు వద్ద అత్యంత విలువైన ఆస్తి ప్రింటింగ్ ప్రెస్ కాదు.. విశ్వసనీయత అని భట్టి విక్రమార్క అన్నారు. జర్నలిజాన్ని రక్షించాలంటే జర్నలిస్టులను కూడా రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల భద్రత, గౌరవం, ఉద్యోగ పరిస్థితులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫెడరేషన్‌ను కోరారు. ముఖ్యంగా జిల్లా, చిన్న పట్టణాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం, ఆసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం వంటి అంశాలను ప్రభుత్వానికి ముందుగా తెలియజేసేది తరచుగా స్థానిక జర్నలిస్టులేనన్నారు. “ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంటే.. మంచి జర్నలిస్టు ప్రభుత్వానికి అత్యుత్తమ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ వంటివారు” అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల స్వభావంలోనే స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సంప్రదాయం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఉద్యమాలు, సాహిత్యం, సంస్కృతిపై ఈ స్వభావం ప్రభావం చూపిందని తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత ఉందని, తమతో విభేదించే గొంతుకలను వినే ధైర్యం ప్రజా జీవితంలో ఉన్నవారికి ఉండాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఫెడరేషన్ కేవలం మరో సంస్థగా కాకుండా ఒక బలమైన సంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి ప్రమాణాలు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. “అధికారంలో ఉన్నవారిని వదలకండి.. అదే సమయంలో మీ వృత్తి ప్రమాణాలను కూడా వదలకండి. మమ్మల్ని జవాబుదారీగా ఉంచండి. మిమ్మల్ని మీరు మీ ప్రమాణాలకు జవాబుదారీగా ఉంచుకోండి. ఈ రెండింటి ప్రయోజనం చివరికి పౌరుడికే దక్కాలి” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ విజయవంతంగా ముందుకు సాగాలని, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతకు, సంక్షేమానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
