‎సింగరేణిని కాపాడుకుంటూ.. లాభాల బాటలో నడిపిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ‎​బిఎస్‌ఎన్‌ఎల్‌లా మారకుండా సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు కై క్రిటికల్ మినరల్స్ వైపు అడుగులు!
  • ‎‎బొగ్గుకే పరిమితం కాకుండా బంగారం, లిథియం మైనింగ్‌లోకి సింగరేణి
  • ‎‎​ఎన్‌టీపీసీ స్థాయిలో సింగరేణిని నిలబెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం
  • ‎‎భట్టి విక్రమార్క సమర్థవంతమైన నాయకత్వంలో సింగరేణి మరింత బలోపేతం అవుతుంది: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.
  • ‎‎సింగ‌రేణి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం పాటుపడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సన్మానించిన సింగరేణి యూనియన్ నాయకులు

‎తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ లాంటి  అత్యుత్త‌మ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన‌ సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా లాభదాయ‌క సంస్థ‌గా   అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ‎సింగ‌రేణి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం దిశా నిర్దేశం చేస్తూ కంపెనీ మ‌నుగ‌డ‌కు కీల‌క‌మైన బొగ్గు బ్లాక్‌లు సాధించ‌డంలో సంపూర్ణ స‌హ‌కారం అందిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లుకు సింగ‌రేణిలోని గుర్తింపు, ప్రాతినిథ్య‌, అధికార సంఘాల నాయ‌కులు సోమ‌వారం డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలో ఘ‌నంగా స‌న్మానించారు. ‎​ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లను తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఐదారు సంవత్సరాల్లో సంస్థ మూతపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు గట్టి పట్టుదలతో నైని కోల్ బ్లాక్‌ను సాధించామని చెప్పారు. ‎2013లో యూపీఏ ప్ర‌భుత్వం సింగ‌రేణికి రీ-అసైన్ చేసిన తాడిచర్ల-2 కోల్ బ్లాక్ విషయాన్ని కేంద్రంతో మాట్లాడి మైనింగ్ లీజు ద‌క్కించుకోవ‌డంలో  ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. అంతేకాకుండా జెన్కోను ఒప్పించి, సింగరేణికి వేలంలో మ‌ణుగూరు డిప్ సైడ్ బ్లాక్ -2 ద‌క్కేలా కృషి చేశామ‌న్నారు.  ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ సమస్యల పరిష్కారానికి స్వయంగా వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి మార్గం సుగమం చేశామని వెల్లడించారు.

‎​ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో సోలార్, విండ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తుండటంతో భవిష్యత్తులో థర్మల్ పవర్ డిమాండ్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. కేవలం బొగ్గుపైనే ఆధారపడితే సింగరేణి కూడా ఒకప్పటి BSNL లా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రపంచ మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి ‘క్రిటికల్ మినరల్స్’ (కీలక ఖనిజాలు) మైనింగ్ వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ​అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని డిప్యూటీ సీఎం చెప్పారు. ‎ఇప్పటికే కర్ణాటకలోని ఒక గోల్డ్ మైన్ వేలంలో పాల్గొని సాధించామని, ఆ గని ద్వారా  భ‌విష్య‌త్ లో అక్క‌డ మైనింగ్ చేస్తే సింగరేణికి నిరంతరం రాయల్టీ లేదా ఆదాయం వ‌స్తుంద‌న్నారు. ప్రస్తుతం సింగరేణిలో 43,000 నుండి 45,000 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 30,000 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో, దేశంలో, ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే మైనింగ్ బ్లాక్‌ల‌ను ద‌క్కించుకునేలా ముందుకు వెళ్లాల‌న్నారు. 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థను   అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్త‌మ సంస్థ‌గా   తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ స‌మ‌ష్టిగా ప‌నిచేసి కంపెనీని ఉన్న‌త‌స్థాయిలో నిల‌ప‌డానికి స‌హ‌క‌రించాల‌న్నారు.

‎​ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్థవంతమైన, డైనమిక్ నాయకత్వంలో సింగరేణి సంస్థ కొత్త గనుల ప్రారంభం, వ్యాపార విస్తరణ మరియు నూతన ప్రాజెక్టులతో శరవేగంగా ముందుకు సాగుతోందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. భవిష్యత్తులో సింగరేణిని దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. సింగరేణి గొప్పతనాన్ని ఎన్నో వేదికలపై ప్రశంసించానని ఆయన గుర్తుచేసుకున్నారు. సింగరేణి మనమందరం గర్వపడాల్సిన ప్రతిష్టాత్మకమైన సంస్థ అని అభివర్ణించారు.

‎సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్య‌క్షులు వాసిరెడ్డి, ప్రాతినిథ్య కార్మిక సంఘం సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జ‌న‌క్ ప్ర‌సాద్‌, అధికారుల సంఘం అధ్య‌క్షులు ల‌క్ష్మీప‌తి గౌడ్‌ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణి కోసం అతికీల‌క‌మైన నైనీ బొగ్గు బ్లాక్ సాధ‌న కోసం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్వ‌యంగా ఒడిశా వెళ్లి అక్క‌డ ముఖ్య‌మంత్రిని, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారంద‌రినీ ఒప్పించి అన్ని అనుమ‌తులు సాధించార‌ని కొనియాడారు. ఆయ‌న కృషి ఫ‌లితంగా గ‌త ఏడాది నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంద‌ని, రాష్ట్ర ఇంధ‌న అవ‌స‌రాల కోసం ఈ నెల‌లో తొలి బొగ్గు రేకును సింగ‌రేణికి కూడా ర‌వాణా చేయ‌డం సాధ్యమైంద‌న్నారు. అదే స‌మ‌యంలో 2013లో యూపీఏ ప్ర‌భుత్వ కేటాయించిన తాడిచెర్ల -2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు సాధించ‌డంలోనూ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కృషి చేశార‌ని ప్ర‌శంసించారు. అదే స‌మ‌యంలో బొగ్గు గ‌నుల వేలంలో పాల్గొన‌కుండా గ‌త బీఆర్ఎస్ పాల‌కులు సింగ‌రేణిని అడ్డుకోవ‌డం వ‌ల్ల కంపెనీ మ‌నుగ‌డ‌కు కీల‌క‌మైన రెండు కీల‌క గ‌నుల‌ను సంస్థ చేజార్చుకుంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణిలో బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొన‌డానికి సింగ‌రేణికి అనుమ‌తి ఇవ్వ‌డం వ‌ల్ల ఇటీవ‌లే మ‌ణుగూరు డిప్‌సైడ్ -2 బ్లాక్‌ను సింగ‌రేణి చేజిక్కించుకుంద‌ని వారు వివ‌రించారు. బొగ్గు ఉత్ప‌త్తికి ప‌రిమిత‌మైన సింగ‌రేణి సంస్థ‌ను కీల‌క ఖ‌నిజ రంగం వైపు తీసుకెళ్తు అంత‌ర్జాతీయ సంస్థ‌గా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్నార‌ని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క‌లో బంగారం, రాగి ఖ‌నిజ అన్వేష‌ణ లైసెన్స్ కూడా సింగ‌రేణి ద‌క్కించుకోవ‌డంలో ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి సాధించిన మ‌రో విజ‌య‌మ‌న్నారు. అదే స‌మ‌యంలో కార్మికుల సంక్షేమానికి అనేక చ‌ర్య‌లు తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. కాంట్రాక్టు కార్మికుల‌కు బోన‌స్ పంపిణీ చ‌రిత్రాత్మ‌క‌మ‌న్నారు. డిపెండెంట్ ఉద్యోగాల్లో గ‌రిష్ట‌ వ‌యో ప‌రిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల‌కు పెంచ‌డం వ‌ల్ల వంద‌ల మంది ల‌బ్ధిపొందార‌న్నారు. ఈ ఆత్మీయ స‌న్మాన కార్య‌క్ర‌మంలో సింగ‌రేణి  గుర్తింపు కార్మిక సంఘం అధ్య‌క్షులు వాసిరెడ్డి సీతారామ‌య్య‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రాజ్ కుమార్‌, ప్రాతినిథ్య కార్మిక సంఘం సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జ‌న‌క్ ప్ర‌సాద్‌, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ న‌ర్సింహారెడ్డి, అధికారుల సంఘం అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ల‌క్ష్మీప‌తి గౌడ్‌, పెద్ది న‌ర్సింహులు, అన్ని ఏరియాల‌కు సంబంధించిన గుర్తింపు, ప్రాతినిథ్య‌, అధికార సంఘాల నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.