క్యూఆర్‌ పరిధిలో ఇందిర‌మ్మ టవర్స్‌ నిర్మాణానికి వడివడిగా అడుగులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్తి
  • అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 27 నుంచి 30 వరకు పారదర్శకంగా లక్కీ డ్రా
  • మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
  • సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌: హైద‌రాబాద్ మ‌హా నగరంలోని క్యూర్ ప‌రిధిలో సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింద‌ని పేదవాడికి కూడా నగరంలో సొంత ఇల్లు ఉండాల‌ని, ఆత్మగౌరవంతో జీవించాల‌నే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాప‌న చేసుకున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే టెండ‌ర్లు ప్ర‌క్రియ‌ను పూర్తిచేశామ‌ని వెల్లడించారు. క్యూఆర్‌ పరిధిలోని తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని ఇందుకోసం జూన్‌ 20 నుంచి ఆగస్టు 15 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 60,720 దరఖాస్తులు అందాయ‌ని, వ‌చ్చిన .దరఖాస్తులపై 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా గుర్తించామ‌న్నారు. అనర్హతకు గల కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి గారు తెలిపారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పార‌ద‌ర్శ‌కంగా లక్కీ డ్రా నిర్వహిస్తామ‌ని ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని కూడా నియ‌మించామ‌ని తెలిపారు. ల‌క్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన త‌ర్వాత ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. 10,000 ఈఎండీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామ‌ని మంత్రి గారు స్ప‌ష్టం చేశారు. 27వ తేదీన రాయ‌దుర్గం, కెపిహెచ్‌బి కాల‌నీ, మైలార్‌దేవర‌ప‌ల్లి, రెడ్ హిల్స్‌, 28న కౌకూర్‌,పాటిగెడ్డ‌,జ‌ల్‌ప‌ల్లి, కుల్సుంపుర , 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కోల‌నీ, బోయ‌న్‌ప‌ల్లి, బండ్ల‌గూడ ( ఎల్ఐజి కాల‌నీ), నందిముస‌లిగుడ‌, 30వ తేదీన గాజుల రామారం, అంబ‌ర్ పేటలోని సిటీపోలీస్ లైన్స్‌, గ‌డ్డిన్నారం, ఆర్‌&బి క్వార్ట‌ర్స్,పోచారం ( ఎల్ఐజి కాల‌నీ)లో ల‌క్కీడ్రా నిర్వ‌హిస్తార‌ని మంత్రి తెలిపారు.

మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక
క్యూర్‌ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామ‌ని తెలిపారు .ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టిన‌ట్లు వివ‌రించారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం లో హయత్‌నగర్‌ గ్రామంలోని అమంగల్‌, గోషామహల్‌ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్‌ (ఆర్టీసీ క్వార్టర్స్‌), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్‌నుమా సమీపంలో) ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ప్రజలు ఇందిరమ్మ టవర్స్‌ కోసం సెప్టెంబర్‌ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాలకు వర్తింపజేసిన నిబంధనలే ఈ కొత్త దరఖాస్తులకూ వర్తిస్తాయ‌న్నారు

ఇందిరమ్మ టవర్స్‌ ప్రత్యేకత కేవలం అపార్ట్‌మెంట్‌లో ఒక ఇల్లు ఇవ్వడంలోనే లేదని నగరంలో విలువైన భూమిపై ఒక కుటుంబానికి శాశ్వత ఆస్తి, భద్రమైన భవిష్యత్‌, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడమే ప్ర‌ధాన లక్ష్య‌మ‌న్నారు. ప్రతిపాదిత ప్లాట్‌ విస్తీర్ణం 525 చదరపు అడుగులు. అన్‌డివైడెడ్‌ షేర్‌ విధానంలో సుమారు 20–25 గజాల భూమిని లబ్ధిదారుల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నామ‌ని ప్రాంతాన్ని బట్టి లబ్ధిదారులకు అందే భూమి విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఉండనుందన్నారు.
ఇంత విలువైన ఆస్తిని పేద కుటుంబానికి అందించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పూర్తి సబ్సిడీ అందిస్తోందని లబ్ధిదారుడి వాటా కేవలం రూ.6 లక్షలు మాత్రమే, అది కూడా నాలుగు విడతల్లో చెల్లించే విధంగా అవకాశం కల్పించామ‌న్నారు.
జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నుంచి ఒక పేద కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి, నగరంలోనే సొంతింటి యజమానిగా నిలబెట్టడమే ఇందిరమ్మ టవర్స్‌ లక్ష్యమ‌న్నారు.