ఉత్తమ అవినీతి అధికారి.. మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ రెయిడ్స్

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ భూగర్భ జలవనరుల శాఖకు చెందిన మైనింగ్ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈ ఉదయం నుంచి రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా జయరాజు విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేపట్టారు. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాల్లో ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ లలో రూ.40 లక్షలు, ఫిక్స్ డ్ డిపాజిట్ రూ. 20 లక్షలు, 40 తులాల బంగారం, రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు పుస్తకాలు, జనగామ జిల్లాలోని 5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాజ్ కు ఇటీవల పంద్రాగస్టు వేడుకల్లో అధికారులు ‘ఉత్తమ అధికారి’ అవార్డును ప్రదానం చేసి సన్మానించడం గమనార్హం. అవార్డు అందుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే ఆయన ఇళ్లపై ఏసీబీ దాడులు జరగడం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.