- 20వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హరిత వాతావరణం ప్రోత్సహించడంలో అందరం భాగస్వాములు కావాలి
- ఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టికల్చర్ & అగ్రికల్చర్ షో
హైదరాబాద్: ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిడి, కాలుష్యం నేపథ్యంలో హరిత వాతావరణాన్ని పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 20వ గ్రాండ్ నర్సరీ మేళా – ఆల్ ఇండియా హార్టికల్చర్ & అగ్రికల్చర్ షోను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి, ఆగస్టు నెలల్లో క్రమం తప్పకుండా నర్సరీ మేళాను నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రజలకు వివిధ రకాల మొక్కలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇంటి స్థాయిలో గార్డెనింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ మేళా మంచి అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ మేళాలో 110కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుంచి తీసుకొచ్చిన అనేక రకాల మొక్కలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. టెర్రస్ గార్డెనింగ్, వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కు అవసరమైన మొక్కలతో పాటు పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, బోన్సాయి, అలంకరణ మొక్కలు వంటి విభిన్న రకాల మొక్కలు మేళాలో అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, కోల్కతాతో పాటు ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ముంబయి, బెంగళూరు, పూణే, షిర్డీ, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి మొక్కలను తీసుకొచ్చారు. నాగాలాండ్ నుంచి వచ్చిన కాక్టస్ వంటి ప్రత్యేక ఆకర్షణ కలిగిన మొక్కలు కూడా మేళాలో ఉన్నాయని వివరించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ.20 నుంచి రూ.2.5 లక్షల విలువైన మొక్కల వరకు వివిధ రకాల మొక్కలు మేళాలో లభిస్తున్నాయని మంత్రి తెలిపారు. మొక్కల పెంపకానికి అవసరమైన మెటీరియల్స్, ఆర్గానిక్ ఎరువులు, ఫెర్టిలైజర్లు, టెర్రకోట కుండీలు తదితర సామగ్రి కూడా ఒకే చోట లభించడం మేళా ప్రత్యేకతగా పేర్కొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అరుదైన, ప్రత్యేకమైన మొక్కలను హైదరాబాద్ నగర ప్రజలకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయని మంత్రి తెలిపారు. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఇంటి పరిసరాల్లో చల్లని వాతావరణం ఏర్పడటానికి కూడా మొక్కలు దోహదపడతాయని అన్నారు. మొక్కల పెంపకాన్ని అలవాటుగా చేసుకోవడం ద్వారా సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిడి, కాలుష్యం నేపథ్యంలో హరిత వాతావరణాన్ని పెంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేళా ద్వారా ప్రజలకు మొక్కలపై అవగాహన పెరగడంతో పాటు ఇంటి స్థాయిలో గార్డెనింగ్‌ను ప్రోత్సహించడానికి మంచి అవకాశం లభిస్తుందని మంత్రి అన్నారు. హైదరాబాద్ నగర వాసులందరూ ఈ ఐదు రోజుల నర్సరీ మేళాను సందర్శించి, తమకు నచ్చిన మొక్కలను కొనుగోలు చేసి తమ ఇళ్లను మరింత పచ్చదనంతో నింపాలని కోరారు.