జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు విజయవంతం

హైదరాబాద్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATG) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 28, 29, 30 తేదీలలో నిర్వహించిన క్రీడా, ఫిట్‌నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. భారత ప్రభుత్వం ప్రకటించిన “ఖేలేగా భారత్ – జీతేగా భారత్” నినాదానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల కేంద్రాలతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ క్రీడా మైదానాలు, స్టేడియంలలో నిర్వహించిన కార్యక్రమాల్లో యువ క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించాయి.

ఆగస్టు 28న భారత హాకీ దిగ్గజం, దేశ క్రీడా గర్వకారణమైన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించడంతో పాటు క్రీడల ప్రాధాన్యం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకర జీవన విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా “ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మేన్” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలతో పాటు “29 ఛాలెంజ్”, “పాస్ ది బాల్ ఛాలెంజ్”, “మీట్ ది ఛాంపియన్స్” వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. వేడుకల ముగింపు సందర్భంగా ఆగస్టు 30న “స్పెషల్ సండేస్ ఆన్ సైకిల్”, రన్‌లు, వాక్‌థాన్‌లు నిర్వహించి ప్రజల్లో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. శారీరక దృఢత్వం, ఆరోగ్య సంరక్షణ, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మాట్లాడుతూ, యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించడం, ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం, ఫిట్ ఇండియా ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి విస్తరించడం లక్ష్యంగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన క్రీడా ఉత్సాహం తెలంగాణలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.