రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్‌టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే సెంటర్లపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్ల పనితీరు, ఏఆర్‌టీ, సరోగసి చట్టాల అమలు, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై మంత్రి సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల పనితీరును మంత్రి సమీక్షించారు. ఈ రెండు సెంటర్లలో కలిపి ఇప్పటివరకు 39,802 మంది పేషెంట్లకు ఫర్టిలిటీ వైద్య సేవలు అందించామని అధికారులు తెలిపారు. 20,185 ఫాలిక్యులర్ స్టడీలు, 521 ఐయూఐ ప్రక్రియలు, 545 ఐవీఎఫ్ కేసులు చేసినట్లు మంత్రికి వివరించారు. ఎంతో మంది దంపతులు తమ సంతాన కలను నెరవేర్చుకోవడంలో గాంధీ, పేట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్‌ను 2024 అక్టోబర్‌లో, పేట్లబుర్జులోని ఎంజీఎంహెచ్‌లో ఐవీఎఫ్ సెంటర్‌ను 2024 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ రెండు సెంటర్లు అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
477 ఏఆర్‌టీ, సరోగసి సెంటర్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 477 ఏఆర్‌టీ, సరోగసి సెంటర్లు రిజిస్టర్ అయి ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. వీటిలో 129 ఏఆర్‌టీ లెవల్-1, 226 ఏఆర్‌టీ లెవల్-2, 59 ఏఆర్‌టీ బ్యాంకులు, 63 సరోగసి క్లినిక్‌లు ఉన్నాయని తెలిపారు. ఏఆర్‌టీ, సరోగసి చట్టాల ప్రకారం సెంటర్ల కార్యకలాపాలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. సెంటర్లలో సిబ్బంది వివరాలు, రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణ, గ్రీవెన్స్ సెల్ తదితర అంశాలను తనిఖీ చేయాలని సూచించారు.
గీత దాటితే కఠిన చర్యలు
ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో అధికారులు నిర్వహించిన తనిఖీలపై మంత్రి ఆరా తీశారు. 379 సెంటర్లను తనిఖీ చేయగా, 50 సెంటర్లలో డీవియేషన్స్ గుర్తించినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యానారాయణ మంత్రికి తెలిపారు. సిబ్బంది మార్పు, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రదర్శించకపోవడం, గ్రీవెన్స్ సెల్ నిర్వహించకపోవడం, రిజిస్ట్రేషన్‌లో ఉన్న చిరునామా కాకుండా మరోచోట సెంటర్ నిర్వహించడం వంటి డీవియేషన్స్ గుర్తించినట్లు వివరించారు. ఆయా సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను బట్టి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 2 సెంటర్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేయగా, 9 సెంటర్ల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఫర్టిలిటీ సేవల పేరుతో పేషెంట్లపై అనవసర ఆర్థిక భారం మోపకుండా, పారదర్శకతతో సేవలు అందేలా చూడాలని మంత్రి సూచించారు. సెంటర్లలో వినియోగిస్తున్న మందులు, ఇంజక్షన్లు, వాటి తయారీ సంస్థలు, ఎంఆర్‌పీ తదితర అంశాలను కూడా తనిఖీల్లో పరిశీలించాలని ఆదేశించారు.
పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి
హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లలో ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు 2,600 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 52 సెంటర్లలో 37 డీవియేషన్స్ గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. లింగ నిర్ధారణకు పాల్పడే అవకాశమున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ రంగంలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రైవేట్ రంగంలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, చట్టబద్ధతను నిర్ధారించేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, ఐవీఎఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుమిత్రతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.