- సర్వే చేసి రైతులకు భూ ఆధార్‌తో పట్టాదార్ పాస్‌బుక్కులు
- విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
హైదరాబాద్, మహబూబాబాద్: రాష్ట్రంలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న దశాబ్దాల భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతి రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపు తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూ భారతి రీ-సర్వే ద్వారా పరిష్కరించి, 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు సంబంధించిన భూ ఆ ధార్‌తో కూడిన పట్టా దార్ పాస్ బుక్కులను మంత్రి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. తెలంగాణలో 125 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగిందని, ఆ తర్వాత ఇంతవరకు సమగ్ర సర్వే జరగలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన గత ప్రభుత్వం కూడా భూముల సమగ్ర సర్వేపై కనీసం ఆలోచన చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూ యజమానులకు అండగా నిలిచేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి, క్యూఆర్ కోడ్, మ్యాప్‌తో కూడిన పట్టాదార్ పాస్ బుక్కులను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని చెప్పారు. నాలుగు రోజుల క్రితం తుంగతుర్తిలో 13 గ్రామాలకు చెందిన రైతులకు 3,400 ఎకరాలకు పట్టాలు అందించామని, ఇప్పుడు నారాయణపురంలో 780 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ భూభారతి ద్వారానే సాధ్యమవుతున్నాయని అన్నారు. నారాయణపురంలో ఇంకా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న సుమారు 150 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన సమస్యను కూడా త్వరలో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజలే మా బలం.. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి అర్హుడికి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాలు, వార్డుల్లోనే ఓట్లు అడుగుతామని అన్నారు. ఇందిరమ్మ పరిపాలనలో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామని గుర్తుచేస్తూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందుబాటులో లేని గత రెవెన్యూ మంత్రులు ఇప్పుడు భూ సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి దశాబ్దాలుగా ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని బీఆర్ఎస్కు ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకునే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, ప్రతిపక్ష నాయకులు చెప్పించుకునే పరిస్థితుల్లో ఈ ప్రజాప్రభుత్వం లేదని అన్నారు.
నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు
అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు తమ తీరు మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. మంచి పనితీరు కనబరిచే అధికారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమన్నారు. 22ఏ నిషేధిత జాబితా, భూ సమస్యలు తదితర అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దన్నారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి నెల కనీసం ఒకటి, రెండు సార్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశాలకు డిప్యూటేషన్ పేరుతో సంతకాలు చేసి కొందరు తహసీల్దార్లు/ఎంఆర్వోలు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.