త్వరలో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ – నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్

ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
వాహనదారులు, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేలా చర్యలు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ సెంటర్
డ్రైవింగ్ ఎలా చేయాలో వివరించేందుకు సిమిలేటర్
నల్లగొండ జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేయనున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
బుధవారం ఆయన ట్రాఫిక్ సిఐ అనిల్, ఐటి సెల్ సిఐ సురేష్ బాబులతో కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో నిర్మించ తలపెట్టిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ట్రైనింగ్ కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల విద్యార్థులకు ఆవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలకు సంబందించిన చిత్రాలు, ఆట స్థలంతో పాటుగా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో వాహనం ఎలా నడపాలో అర్ధం అయ్యే విధంగా వివరించడానికి సిమిలేటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్న వారికి రోడ్డు ప్రమాదాల వీడియోలు ప్రదర్శించి వారిలో అవగాహన పెంపొందించే విధంగా కౌన్సిలింగ్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. సెమినార్ హాల్ ప్రత్యేకంగా నిర్మాణం చేయడం ద్వారా పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా సౌకర్యాలు కల్పించేలా నిర్మాణం చేయనున్నట్లు వివరించారు.
నిర్మాణ పనులను తరచూ పరిశీలిస్తామని, ఎప్పటికప్పుడు నిర్మాణ పురోగతిని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తున్నదని ఎస్పీ తెలిపారు.
ఆయన వెంట ట్రాఫిక్ సిఐ అనిల్, ఐటి సెల్ సిఐ సురేష్ బాబు, పిఆర్వో రామకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.