కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్‌మెంట్ సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • కుట్టు మిషన్ల కొరకు ఇప్పటి వరకు 1,80,170 దరఖాస్తులు .. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • బీసీ కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లకు కార్యాలయాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలి
  • మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల సొంత భావనల స్థలాల ఐడెంటిఫై కోసం ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ
  • కళ్యాణ లక్ష్మి పథకం పై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలి
  • బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

హైదరాబాద్ : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, ప్రొక్యూర్‌మెంట్, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కుట్టు మిషన్ల కోసం ఇప్పటివరకు వివిధ జిల్లాల నుంచి 1,80,170 దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కుట్టు మిషన్ల ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, టెండర్ల తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. సెప్టెంబర్ 7వ తేదీలోపు ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 తర్వాత ప్రీ-బిడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, మహిళా సంఘాలు, గ్రామపంచాయతీల సహకారంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలోపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కుట్టు మిషన్ల పథకం అమలుపై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు.

బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు మౌలిక సదుపాయాలు
ఇటీవల వివిధ బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు ఎన్నికైన చైర్మన్లకు కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని మంత్రి ఆదేశించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, వాటి పురోగతి తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

బీసీ గురుకులాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని 327 మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల పనితీరు, మౌలిక సదుపాయాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై మంత్రి సమీక్షించారు. 327 గురుకుల పాఠశాలల్లో ప్రస్తుతం 22 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్న నేపథ్యంలో మిగిలిన పాఠశాలలకు అవసరమైన భవనాలు, స్థలాలపై సమగ్ర నివేదికను ఈ నెల 15వ తేదీలోపు అందించాలని ఆర్‌సీవోలను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో బీసీ గురుకులాలకు స్థలాలు అందుబాటులో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో స్థలాలు లేని పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా నివేదిక రూపొందించాలని సూచించారు. అవసరమైన చోట్ల జిల్లా కలెక్టర్ ద్వారా స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఒక నియోజకవర్గంలో మంజూరైన మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు ఇతర నియోజకవర్గాల్లో కొనసాగుతున్న వాటిని గుర్తించి, మంజూరైన నియోజకవర్గంలోనే పాఠశాల నిర్వహణకు అనువైన భవనాలను గుర్తించి షిఫ్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలో భవనాల అద్దెలు, ఇతర పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు బీసీ సంక్షేమ శాఖ సెక్రెటరీ, ఎంజేపీ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రెటరీలతో సమావేశమై సమస్యలను క్లియర్ చేసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫాంలు, షూస్, ఇతర మౌలిక సదుపాయాలు ఎంతవరకు పూర్తయ్యాయో, తక్కువ శాతం మాత్రమే పూర్తయిన పాఠశాలలు ఏవో గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లపై సమీక్ష
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్పెషల్ కేసులకు సంబంధించి గతంలో మంజూరైన స్కాలర్‌షిప్‌లు, వచ్చిన దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి
కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో 2023-26 మధ్య వచ్చిన దరఖాస్తులు, క్లియర్ చేసిన చెక్కులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బీసీ స్టడీ సర్కిల్‌ను ఆధునికీకరించాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన శిక్షణ అందించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి, గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలు, నైపుణ్య శిక్షణలకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల పంపిణీపై ఆరా
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల భద్రత కోసం అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు ఎంతమందికి అందించారో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గీత కార్మికులు ఉండగా, 40 వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్లు అధికారులు వివరించారు. శిక్షణ పూర్తి చేసిన వారిలో ఎంతమందికి రక్షణ కిట్లు అందించారో వివరాలు సేకరించి, మిగిలిన వారికి కూడా త్వరగా అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 రక్షణ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నీరా కేఫ్, నందనం రీటెండర్లపై ఆదేశాలు
నీరా కేఫ్‌కు సెప్టెంబర్ 7వ తేదీలోపు రీటెండర్ నిర్వహించాలని, నందనం ప్రాజెక్టుకు సెప్టెంబర్ 15వ తేదీలోపు రీటెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో మోడర్న్ దోబీఘాట్
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక మోడర్న్ దోబీఘాట్ ఏర్పాటు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో ప్రామాణికంగా హుస్నాబాద్, హుజురాబాద్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో మోడర్న్ దోబీఘాట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రతి పథకం, కార్యక్రమం లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాలమాయాదేవి, ఎంజేపీ సెక్రెటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.