రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవిశాఖ బీట్‌ అధికారి

 రాష్ట్రంలో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు చిక్కారు.  ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాది జిల్లా ఆలపల్లి మండలం కాచనాపల్లి గ్రామానికి చెందిన ఫారెస్టు బీట్‌ అధికారి బానోత్‌ రవికుమార్‌ , ప్రైవేట్‌ వ్యక్తి పఠాన్‌ సాధిక్‌ ఖాన్‌ అనే ఇద్దరిని పట్టుకున్నారు. అటవి శాఖ పరిధిలో ఉండే పోడు భూముల్లో ( Podu Lands ) వ్యవసాయం సాగుకు, ట్రెంచెస్‌ తవ్వకాలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని,పోడు భూములకు పట్టా చేసివ్వాలని ఫారెస్టు బీట్‌ అధికారిని మధ్యవర్తి ద్వారా సంప్రదించాడు. ఇందుకు రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా వారి వ్యూహం మేరకు రామానుజగూడెంలో అటవి అధికారి బానోత్‌ రవికుమార్‌ ఆదేశాల మేరకు మధ్యవర్తికి లంచం డబ్బు అందజేశాడు. వెంటనే ఏసీబీ అతడిపై దాడి చేసి రూ.30 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి , కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు.