హైదరాబాద్ : మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగ చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ సంస్థల చైర్మన్లు, శాఖాధిపతులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తగిన గుర్తింపు, ప్రచారం లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. తమ పరిధిలోని సమస్యలను జాబితా రూపొందించుకుని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. తాను తన వద్దకు వచ్చే ఫైళ్లను వెంటనే పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరిస్తున్నానని అజహరుద్దీన్ గారు తెలిపారు. అదే విధంగా అధికారులు కూడా తమ పనుల్లో వేగం పెంచాలని, ‘సంక్షేమం’ అనే పదానికి నిజమైన అర్థం వచ్చేలా పనిచేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, TGMREIS, ఖాజీలకు సంబంధించిన అంశాలతో పాటు మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని ఇతర సంస్థలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, IAS, కార్యదర్శి బి. షఫీఉల్లా, IFS, TGMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ గులాం అఫ్జల్ బియాబానీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తదితర అధికారులు హాజరయ్యారు. మైనారిటీ సంక్షేమ సంస్థల చైర్మన్లు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వానికి విమర్శలకు తావులేకుండా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఫహీమ్ ఖురేషీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పనితీరును వివరించే సమాచారంతో వక్ఫ్ బోర్డు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, శ్మశానవాటికలు, సమాధుల స్థలాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలు సహా పలు సమస్యలను కలెక్టర్ల సమావేశం అజెండాలో చేర్చాలని సూచించారు. తద్వారా ఇటువంటి సమస్యలను సకాలంలో పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా పలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ సంస్థలు సజావుగా పనిచేసేందుకు వాటిని పరిష్కరించాలని కోరారు. తన శాఖ పరిధిలోని విభాగాల పనితీరుకు ఎలాంటి పరిపాలనా అవరోధాలు ఎదురుకాకుండా చూస్తానని మంత్రి అజహరుద్దీన్ హామీ ఇచ్చారు.