- 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు
- అదనంగా 485 వెంటిలేటర్ల ఏర్పాటు
- వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ
- శాసన మండలిలో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదనంగా 485 వెంటిలేటర్లను కూడా కొనుగోలు చేసి అవసరమైన హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గురువారం శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 9 ఎంఆర్ఐలు, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా నిజామాబాద్ జీజీహెచ్, సిద్ధిపేట జీజీహెచ్, సూర్యాపేట జీజీహెచ్, నల్గొండ జీజీహెచ్, మహబూబ్‌నగర్ జీజీహెచ్, నీలోఫర్ తదితర హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, అక్కడికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అదనపు ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా 9 అత్యాధునిక టెక్నాలజీతో కూడిని 3టెస్లా ఎంఆర్ఐ యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 50 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా మరో 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన చోట అదనంగా 485 వెంటిలేటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ
వైద్య పరికరాలను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, అవి నిరంతరం పనిచేసేలా చూడటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. వైద్య పరికరాల కొనుగోలు, సరఫరా, నిర్వహణకు సంబంధించిన వివరాలను పర్యవేక్షించేందుకు ఈ-ఉపకరణ్ అనే వెబ్ ఆధారిత పరికరాల జాబితా, నిర్వహణ వ్యవస్థను వినియోగిస్తున్నామని తెలిపారు. వైద్య పరికరాల పనితీరు, వర్కింగ్ కండీషన్, నిర్వహణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టీజీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పీఎంయూ ద్వారా పరికరాలను క్రమం తప్పకుండా ఆడిట్ చేసి, వాటి పనితీరు, వర్కింగ్ కండీషన్, నిర్వహణ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో సర్వీసింగ్, రిపేర్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రిపేర్లు తక్షణమే జరిగేలా. బయోమెడికల్ ఇంజనీర్లను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.
1,500 మందికి పైగా టెక్నీషియన్ల నియామకం
వైద్య పరికరాలు నిరంతరం పనిచేయాలంటే శిక్షణ పొందిన టెక్నీషియన్లు కీలకమని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో గత రెండున్నరేళ్లలో 1,500 మందికి పైగా టెక్నీషియన్లను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించామని వెల్లడించారు. అవసరమైన చోట కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో టెక్నీషియన్లను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.