ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం: సిఇఒ సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ల కు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటర్ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు(adult family member) ఇఆర్ఒ/ఎఇఆర్ఒల ఎదుట వ్యక్తిగతంగా హాజరై తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, అవసరమై సమాచారాన్నిఅందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని సిఇఒ సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ కు సంబంధించిన పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించామని, దానికి అనుగుణంగా ఓటర్లకు ఇచ్చిని నోటీసులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఫారం-6కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, డిక్లరేషన్ ఫారం స్వీకరణ, క్లెయిమ్ ల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్హత తేదీ 1.10.2026 పరిగణిస్తూ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు, అలాగే భవిష్యత్ లో అందే ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని సిఇఒ ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ భారత ఎన్నికల సంఘం నిబంధనాలకు అనుగుణంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సిఇఒ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.