వర్షాభావ పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో కరువు మండలాల ప్రతిపాదనలకు అవసరమైన సమాచారాన్ని అందించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ మద్దతు ధరకు 100 శాతం కేంద్రం కొనుగోలు చేయాలి
  • ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందేలా కేంద్రం చిత్తశుద్ధి చూపించాలి

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని మండలం యూనిట్‌గా కరువు మండలాల ప్రతిపాదనలకు డిపార్ట్ మెంట్ సేకరించిన సమాచారాన్ని వారికి అందచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కేవలం వర్షపాతం లోటును మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, వర్షపాతం వ్యత్యాసం, SPI, పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, NDVI/NDWI, VCI, నేల తేమ, రిజర్వాయర్ నిల్వలు, భూగర్భజల పరిస్థితులు, ప్రవాహ జలాలు, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి, వలసలు తదితర అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీనికి గాను వ్యవసాయశాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను వారికి ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశించారు. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనతో పంట నష్టాన్ని నిర్ధారించాలని పేర్కొన్నారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం లోటు ఉంటే లోటు వర్షపాతంగా, 60 నుంచి 99 శాతం లోటు ఉంటే భారీ లోటుగా, వర్షం పూర్తిగా లేకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలని కరువు నిర్వహణ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా, సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 85 శాతం కంటే తక్కువగా ఉండటం కరువు పరిస్థితికి, 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండటం తీవ్రమైన కరువు పరిస్థితికి సూచికగా పరిగణించాలని పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం కొనుగోలు చేయాలి – కేంద్రానికి మంత్రి తుమ్మల సూచన మద్ధతు ధర ప్రకటించడంతో కేంద్రం బాధ్యత అయిపోదని, ఆ మద్ధతు ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే అని మంత్రి తుమ్మల అన్నారు. నిన్న కేంద్ర కేబినెట్ రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది. ఇందులో కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.675, రేప్‌సీడ్–ఆవాలకు రూ.413, మసూర్‌కు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున పెంపు ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎస్ఎస్ లో ఆయా రాష్ట్రాలలో సాగవుతున్న పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్ ద్వారా కేవలం 25 శాతం మాత్రమే సేకరిస్తుందని, అలా కాకుండా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. మద్దతు ధర ప్రకటించడం మాత్రమే కాకుండా, రైతు పండించిన పంటను ఆ ధరకు విక్రయించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందేలా చిత్తశుద్ధితో కేంద్రం చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ప్రకటించిన మద్ధతు ధరకు 100 శాతం పంటల సేకరణ జరిగినప్పుడే రైతులకు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, మార్కెటింగ్ ఎండి రాహుల్ రాజ్ మరియు హార్టికల్చర్ ఎండి యాస్మిన్ బాషా పాల్గొన్నారు.