హైదరాబాద్ : డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఆయా శాఖలు ఇప్పటివరకు సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి సమ్మిట్‌కు విస్తృత భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని ప్రముఖ కంపెనీలకు సమ్మిట్ అడ్వైజరీ బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు. ప్రముఖ బహుళజాతి కంపెనీల గ్లోబల్ హెడ్లను సమ్మిట్‌కు ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీల అగ్ర నాయకత్వంతో అనుసంధానం ఏర్పరచి, ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నెలలో విదేశాలలో రోడ్‌షోలను నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు. ఈ రోడ్‌షోల ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, వ్యాపార అనుకూల వాతావరణం, పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రముఖులకు వివరించే అవకాశం లభిస్తుందని తెలిపారు.ఈ నెలాఖరున న్యూఢిల్లీలో కూడా రోడ్‌షో నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని రంగాలకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసినట్లు సమావేశంలో అధికారులు తెలిపారు. అరేనా, ఎగ్జిబిషన్ ఏర్పాట్లతో పాటు మీడియా, ఆతిథ్యం, లాజిస్టిక్స్, ప్రోటోకాల్, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ సలహాదారు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, వాణీ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సీఈఓ సెర్ప్ దివ్య, స్పెషల్ సీఐపీఆర్ ముకుంద రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.