- 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు సమిష్టి కృషి అవసరం
- బ్లాక్ స్పాట్లను గుర్తించడం కాదు.. శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలి
- డిజైన్ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యత
- భూసేకరణ, రైట్ ఆఫ్ వే రహదారి భద్రతలో కీలక అంశాలు
- హైదరాబాద్ – విజయవాడ NH – 65 రహదారి పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకరం
- 6+2 లేన్ విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి
- రోడ్డు భద్రత ఆడిట్లు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి
- కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి
గుజరాత్ (ఎక్తానగర్): గుజరాత్ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్ శివిర్–2026 రెండో రోజు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి “సురక్షిత రహదారుల రూపకల్పన – ప్రమాణాల నుంచి అమలు వరకు” అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్‌కు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలకోపన్యాసం చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి “Designing Safe Highways From Standards to Implementation”సెషన్ లో మాట్లాడుతూ… రహదారి భద్రతకు సంబంధించి ప్రమాణాలు, మార్గదర్శకాలు రూపొందించడం మాత్రమే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, సురక్షితమైన రహదారిని అందించడమే అసలైన లక్ష్యమన్నారు. ఈ ముఖ్యమైన అంశంపై చర్చకు నాయకత్వం వహించే అవకాశం కల్పించిన కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు, మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్యానల్ సభ్యలుగా ప్రత్యేక కార్యదర్శి వినయ్ కుమార్ రాజావత్, జాయింట్ సెక్రటరీ సీహెచ్. సింగ్, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సెక్రటరీ జనరల్ రాహుల్ గుప్తా, ఐఐటీ కాన్పూర్ డీన్, ప్రొఫెసర్ నితిన్ సక్సేనా, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వెంకటేశ్ బాలసుబ్రమణియన్, ఎన్హెచ్ఐడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) అమరేంద్ర కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు NHAI ఛైర్మన్ సంతోష్ యాదవ్,MoRTH సెక్రటరీ ఉమాశంకర్ కూడా ప్యానెల్ డిస్కషన్ లో మంత్రి లేవనెత్తిన హైదరాబాద్- విజయవాడ NH-65 అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రహదారి భద్రత రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాలతో పంచుకునే అవకాశం ఈ చింతన్ శివిర్ ద్వారా లభించిందని అన్నారు.
అంతర్జాతీయ అనుభవాల నుంచి నేర్చుకోవాలి
ఇటీవల తాను పలు దేశాల్లో పర్యటించి రహదారి భద్రతకు సంబంధించిన అనేక ఉత్తమ విధానాలను పరిశీలించానని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు రోడ్డు భద్రతను కేవలం ఇంజినీరింగ్ అంశంగా కాకుండా ప్రత్యేక వృత్తిపరమైన విభాగంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. స్వీడన్ అమలు చేస్తున్న ‘విజన్ జీరో’ విధానం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. రహదారిపై ఒక్క మరణం లేదా తీవ్ర గాయం కూడా ఆమోదయోగ్యం కాదన్న ఆలోచనను భారత పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియా అనుసరిస్తున్న ‘సేఫ్ సిస్టమ్’ విధానం మానవ తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, వాహనాలు, వేగ పరిమితులను రూపొందిస్తోందని చెప్పారు. అమెరికా ఫెడరల్ హైవే అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న రోడ్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌లు, సాంకేతిక మార్గదర్శకాలను కూడా భారత రహదారుల పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించవచ్చన్నారు.
రోడ్డు భద్రతకు ప్రత్యేక నిపుణుల వ్యవస్థ అవసరం
ప్రాజెక్టుల అమలులో ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ వ్యవస్థలకు తోడుగా స్వతంత్ర రోడ్డు భద్రత నిపుణుల వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. రోడ్డు భద్రత ఆడిట్లు ఒకసారి నిర్వహించి పూర్తి చేసే ప్రక్రియగా కాకుండా.. డిజైన్ దశలో, నిర్మాణ సమయంలో, రహదారి ప్రారంభానికి ముందు, ప్రారంభించిన తర్వాత కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. అంతర్జాతీయ నమూనాలను పరిశీలించి, కీలక రహదారులు ప్రారంభించే ముందు భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలయ్యాయా లేదా పరిశీలించే విధంగా స్వతంత్ర ‘రోడ్డు భద్రత అంబుడ్స్‌మన్’ (Road Safety Ombudsman) లేదా భద్రతా ప్రాధికార సంస్థ (Safety Authority) ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని సూచించారు.
భూసేకరణ.. రహదారి భద్రతలో కీలక అంశం
రహదారుల నిర్మాణంలో భూసేకరణ, రైట్ ఆఫ్ వే (Right of Way) అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని మంత్రి చెప్పారు. సరైన జంక్షన్లు, తగినంత విజిబిలిటీ, సర్వీస్ రోడ్లు, పాదచారుల సౌకర్యాలు కల్పించాలంటే అవసరమైన మేరకు భూమి అందుబాటులో ఉండాలని అన్నారు. అనియంత్రిత మీడియన్ ఓపెనింగ్స్, నేరుగా ఇళ్లకు లేదా వాణిజ్య సంస్థలకు ఇచ్చే యాక్సెస్‌లు, సరిగా డిజైన్ చేయని కూడళ్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల మీదుగా వెళ్లే హైవేలపై పాదచారుల క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు, బస్ బేలు, లైటింగ్, సైన్ బోర్డులు, ట్రాఫిక్ కాల్మింగ్ చర్యలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
బ్లాక్ స్పాట్ గుర్తించడం కాదు.. శాశ్వత పరిష్కారం చూపాలి
ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించడం మాత్రమే పరిష్కారం కాదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై నిర్ణయాలు మరింతగా డేటా ఆధారంగా ఉండాలని, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదం సంభవించే అవకాశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్మాణ నాణ్యత కూడా రోడ్డు భద్రతలో భాగమే
డిజైన్ ఎంత సురక్షితంగా ఉన్నా నిర్మాణ నాణ్యత లోపిస్తే దాని ప్రయోజనం ఉండదని మంత్రి అన్నారు. కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్, సూపర్విజన్, రోడ్ మార్కింగ్స్, సైన్ బోర్డులు, క్రాష్ బ్యారియర్లు, డ్రైనేజీ, పేవ్మెంట్ నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.
నిర్మాణం, నిర్వహణ సమయంలో వర్క్జోన్ భద్రతకు కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సరైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్లు, బ్యారికేడింగ్, లైటింగ్, హెచ్చరిక బోర్డులు, సురక్షిత డైవర్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్మికులు, వాహనదారుల భద్రతను కాపాడాల్సి ఉందన్నారు.
టెక్నాలజీతో ప్రమాదాలను ముందుగానే గుర్తించాలి
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, సీసీటీవీ (CCTV) నిఘా, ఇన్సిడెంట్ డిటెక్షన్, స్పీడ్ మానిటరింగ్, జీఐఎస్(GIS) ఆధారిత సేఫ్టీ మ్యాపింగ్, డ్రోన్లు, డిజిటల్ రోడ్ ఇన్వెంటరీ వంటి సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. డిజైన్‌లో సేఫ్.. నిర్మాణంలో సేఫ్.. ఆపరేషన్‌లో సేఫ్.. రహదారి మొత్తం జీవితకాలంలో సేఫ్ అనే విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలి
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్దేశించిన విధంగా 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించే జాతీయ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా రోడ్డు సేఫ్టీ సమావేశాలు నిర్వహించి ప్రమాదాలను విశ్లేషించాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి జిల్లా స్థాయిలో తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
దేశంలో రోడ్డు ప్రమాద మరణాలు ఆందోళనకరం
2023లో దేశవ్యాప్తంగా 1,72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని మంత్రి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 23,652 మంది, తమిళనాడులో 18,347 మంది, మహారాష్ట్రలో 15,366 మంది, మధ్యప్రదేశ్‌లో 13,798 మంది, కర్ణాటకలో 12,321 మంది మరణించారని చెప్పారు. తెలంగాణలో 2023లో 7,660 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ఇది దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 4.4 శాతంగా ఉందన్నారు. దేశంలోని మొదటి పది రాష్ట్రాల్లోనే దాదాపు 74 శాతం రోడ్డు ప్రమాద మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ – విజయవాడ NH – 65 రహదారి పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై ఈ సమావేశంలో మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 17బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మాణం జరుగుతున్నా… ప్రస్తుతం ఉన్న 4 లేన్ రహదారిపై ట్రాఫిక్ లోడ్ విపరీతంగా పెరిగిందన్నారు. 6+2 లేన్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహదారి విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ఈ రహదారి విస్తరణ అంశం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించామని,త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి,పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే అంశమని అభివర్ణించారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లో రోడ్డు ప్రమాద మరణాల రేటు కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. అమెరికా, యూకే, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు రహదారి డిజైన్, వాహన భద్రత, వేగ నియంత్రణ, కఠినమైన అమలు, పాదచారులు–సైక్లిస్టుల భద్రత, ప్రమాద డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించ గలిగాయని తెలిపారు.
ఐదు అంశాలపై సమిష్టిగా దృష్టి పెట్టాలి
చింతన్ శివిర్‌లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
- భద్రతను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాలి
- నిర్మాణంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
- నిర్వహణలో భద్రతను నిర్ధారించాలి
- డేటా, సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి
- నిరంతరం సమీక్షిస్తూ మెరుగుపరుచుకోవాలి
ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది కాదు.. ఎన్ని ప్రాణాలు కాపాడామన్నదే ముఖ్యం
హైవే ప్రాజెక్టు విజయాన్ని కేవలం ఎన్ని కిలోమీటర్ల రహదారి నిర్మించాం, ఎంత ప్రయాణ సమయం తగ్గించాం, ఎంత ట్రాఫిక్ సామర్థ్యం పెంచాం అనే అంశాలతో మాత్రమే కొలవకూడదని మంత్రి అన్నారు. “అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే.. మనం ఎన్ని ప్రాణాలను కాపాడగలిగాం?” అని అన్నారు. ప్రతి వాహనదారుడు, ప్రయాణికుడు, పాదచారి, సైక్లిస్ట్, ద్విచక్ర వాహనదారుడు, హైవేల వెంట నివసించే స్థానిక ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా రహదారులను నిర్మించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయాణంతో పాటు ప్రతి ప్రయాణం సురక్షితంగా ఉండే భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. “ఈ రోజు మనం నిర్మించే ప్రతి కిలోమీటర్ రహదారి.. రాబోయే తరాలకు కూడా సురక్షితంగా ఉండాలి. ప్రమాణాల నుంచి అమలుకు.. అమలు నుంచి మెరుగైన పనితీరుకు మన ప్రయాణం కొనసాగాలి” అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఐఏస్ , చీఫ్ ఇంజినీర్ (నేషనల్ హైవేస్) ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ (RRR & CRIF) వసంత్ నాయక్, చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్ & HAM) బి. వెంకటేశ్వరరావు,పలువురు అధికారులు పాల్గొన్నారు.