- క్షేత్రస్థాయి విస్తరణ సేవలకు తోడుగా మొబైల్ ఫో న్ ద్వారా మరో ముందడుగు
వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి కమిషనరేట్ స్థాయి అధికారుల వరకు రైతులకు ఇప్పటికే వ్యవసాయ విస్తరణ సేవలు అందుతున్నాయి. వీటికి అదనంగా, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే సలహాలు పొందేందుకు వీలుగా కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ (KHC) మరో ముందడుగుగా నిలుస్తోంది. పంటకు తెగులు సోకినా, ఎరువు ఎంత వేయాలో తెలియకపోయినా, ప్రభుత్వ పథకం అందకపోయినా రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551 కు ఫోన్ చేస్తే చాలు. తెలుగులోనే తక్షణ సలహా, సమాచారం అందుతాయి. సేవలు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు, వారంలో 7 రోజులూ అందుబాటులో ఉంటాయి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ కేంద్రం, తెలంగాణ రైతుల కోసం హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకుల కార్యాలయంలో పనిచేస్తోంది.
KHC ద్వారా అందే సేవలు:
- విజ్ఞుల సలహా: శాస్త్రవేత్తల మార్గదర్శకత్వం
- పథకాల సమాచారం: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు ,సందేహాల నివృత్తి
- పంటల పరిష్కారాలు: పంటలు, విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సాగు పద్ధతులపై సలహాలు
- ఇన్పుట్ సమాచారం: విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెట్ ధరలు
- పశుపోషణ సలహా: పశు ఆరోగ్యం, పోషణపై సూచనలు
- వాతావరణం, విపత్తు సమాచారం: వాతావరణ శాఖ సూచనల మేరకు హెచ్చరికలు
కేంద్ర ఎరువుల యాప్ కు సంబంధించిన సాంకేతిక సందేహాల నివృత్తి
సలహాలతో పాటు, వ్యవసాయ పథకాలకు సంబంధించిన రైతుల ఫిర్యాదులను కూడా ఇదే నంబర్ ద్వారా తెలియజేయవచ్చు. “రైతుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” ఇదే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉండగా, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్రం సహాయపడుతుంది. ఈ సేవలు మారుమూల గ్రామాల్లోని ప్రతి రైతుకూ తెలిసేలా, క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు) విస్తృతంగా అవగాహన కల్పించాలని, రైతులు తమ సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐ.ఏ.ఎస్ సూచించారు.