ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన : స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ సిటీలో ఉన్న చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని తెలంగాణ శాస‌న‌స‌భ స‌భాప‌తి (స్పీక‌ర్) గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, శాస‌నమండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం సందర్శించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు వంటి అంశాలపై అధ్యయనం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్య వ్యవస్థలో శాసనసభలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ విధానాలపై చర్చించడం, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అధ్యయనం చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు, శాసనసభల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై మరింత అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పర్యటనలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాస‌న‌స‌భ సెక్రెట‌రీ రెండ్ల తిరుప‌తి, శాసన మండలి సెక్రెటరీ డా నరసింహాచార్యులు, శాసన సభ స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.