- అక్టోబర్ 15 నాటికి డిజిటల్ రికార్డుల ప్రక్రియ పూర్తి చేయాలి
- భవిష్యత్‌లో ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులు పూర్తిగా డిజిటల్ విధానంలోనే
హైదరాబాద్ : రాష్ట్రంలో మరింత పారదర్శక పరిపాలన అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (e-HRMS)లో పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ-హెచ్ఆర్ఎంఎస్ అమలు, ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ విధానాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు, ఏసీఆర్లు, ఇతర ఉద్యోగ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటాను ఈ-హెచ్ఆర్ఎంఎస్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. మొత్తం 38,710 కార్యాలయాలకు సంబంధించిన డేటాలో ఇప్పటికే సుమారు 93 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రక్రియను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
భవిష్యత్‌లో డిజిటల్ అనుమతులకే ప్రాధాన్యం
ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, వేగం, సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులను సాధ్యమైనంత వరకు డిజిటల్ విధానంలోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ-సాంక్షన్ ఉత్తర్వులను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక సేవలు, మంజూరులు, చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియలను ఆన్లైన్లో నిర్వహించేలా వ్యవస్థలను సమన్వయం చేయాలని సూచించారు.
పనులన్నీ ఆన్లైన్లోనే
ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల ప్రక్రియను కూడా ఆన్లైన్లో నిర్వహించాలని సీఎస్ తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుంచి చీఫ్ ఇంజనీర్ (CE) వరకు సాంకేతిక అనుమతుల ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా, లబ్ధిదారులకు నేరుగా అందించే DBT (Direct Benefit Transfer) మంజూరులను ఆధార్ ఆధారిత ధృవీకరణతో పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
డిజిటల్ పరిపాలనకు నోడల్ అధికారులు
ఈ-హెచ్ఆర్ఎంఎస్తో పాటు అన్ని డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సూచించారు. డిజిటల్ వ్యవస్థల అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా శాఖల వారీగా సమన్వయం ఉండాలని తెలిపారు. ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంతో పాటు Ease of Doing Businessకు మరింత ఊతమిచ్చేలా డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ లు బి.ఎం.డి.ఎక్కా, సభ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, అహ్మద్ నదీం, క్రిస్టినా చొంగ్తూ,శిఖాగోయల్, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, లోకేష్ కుమార్, దివ్య దేవరాజన్, సురేంద్ర మోహన్, హరిచందన, ఇ. శ్రీధర్, సిక్తాపట్నాయక్, విజయేంద్ర, సమాచార, పౌరసంబంధాల స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
