- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పిన బతుకమ్మ సంబరాలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO Association) మహిళా విభాగం ఆధ్వర్యంలో టీజీవో (TGO) భవన్, గృహకల్ప కాంప్లెక్స్, నాంపల్లి, హైదరాబాద్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ దీపా రెడ్డి నాయకత్వంలో, కన్వీనర్ శ్రీమతి జె. సుజాత, కోశాధికారి శ్రీమతి శాంతిశ్రీ సమన్వయంతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు, మహిళల సందడి, సమష్టి భాగస్వామ్యంతో టీజీవో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను కొలుస్తూ, పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యులు శ్రీమతి దనసిరి అనసూయ సీతక్క, పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటంలో అందరూ భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపుదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ పాల్గొని మహిళా ఉద్యోగులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల జీవన సంస్కృతిలో విడదీయలేని భాగంగా కొనసాగుతోంది. మహిళలు ఐక్యంగా పాల్గొని సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచింది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా ఉద్యోగుల్లో ఐక్యతా భావాన్ని, పరస్పర స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, పూల పండుగ వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు చెందిన టీజీవో సంఘం ప్రతినిధి బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. మహిళా ఉద్యోగులు, వివిధ జిల్లాల ప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో వేడుకలు అంగరంగ వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీపా రెడ్డి, చైర్మన్, మహిళా విభాగం శ్రీమతి జె. సుజాత, కన్వీనర్, శ్రీమతి శాంతిశ్రీ కోశాధికారి, మహిళా విభాగం శిరీష, డా నవీన్ జ్యోతి, పూనమ్, కిరణ్మయి జయశ్రీ, ఎంజుల రెడ్డి, గద్వాల అనిత, సబితా, లావణ్య, సునీత జోషి, , అలివేలు, కవిత, గోరేటి అరుణ, శ్రీలీల, రమాదేవి, షీలా, అలాగే ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, డా రామ రావు, m.b. కృష్ణ యాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, శౌకత్ హుస్సేన్, శ్రీనేష్ కుమార్, నిరంజన్ రెడ్డి, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.