
భద్రాచలం ఎస్టీవో కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లును లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్టీవోగా పనిచేస్తున్న షేక్ సైదులు సీనియర్ అకౌంటెంట్‌తో లంచం అడిగించాడని తేలడంతో ఆయన్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లుమల్లు నారాయణ అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్‌గా చర్ల మండలంలో పనిచేస్తూ 2008లో పదవీ విరమణ చేశారు. ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫర్మ్ కాకపోవడంతో అప్పటి పెన్షన్ సెటిల్‌మెంట్ కాలేదు. పెన్షన్ సెటిల్ చేసేందుకు బొల్లుమల్లు నారాయణను భద్రాచలం సహాయ కోశాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్టీవో షేక్ సైదులు, సీనియర్ అకౌంటెంట్ వెంకటేశ్వర్లు రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. భద్రాచలం కరకట్ట సమీపంలో అధికారులు రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా సీనియర్ అకౌంటెంట్ ఎం.వెంకటేశ్వర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ద్వారా డబ్బులు అడిగిన ఎస్టీవో ఎస్కే సైదులును కూడా అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మధుసూదన్, రమణమూర్తి, రవింధర్, క్రాంతికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.