పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయ యునెస్కో గుర్తింపు దిశగా కృషి చేస్తా
  • శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి నిదర్శనం
  • నిధులు మంజూరు కావటంతో భక్తులు,స్థానిక ప్రజలు హర్షం

హైదరాబాద్: పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయా సోమేశ్వరాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

ప్రపంచస్థాయిలో ఎక్కడ లేని విధంగా “వందల ఏళ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి, ప్రాచీన నిర్మాణ విజ్ఞానానికి అద్భుత నిదర్శనమన్నారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతో పాటు మరింత పర్యాటక ప్రాధాన్యత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మంత్రి చొరవతో ఆలయ అభివృద్ధి నిధులు విడుదల కావటంలో భక్తులు,స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.