పరిశ్రమల తనిఖీలకు వెళ్లే టిజిపిసిబి ఉద్యోగులకు టిజిపిసిబి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షలు

పరిశ్రమల తనిఖీల సమయంలో వివిధ కాలుష్య కారకాలకు గురయ్యే అవకాశం ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగానే ఈసారి ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు టిజిపిసిబి ఉద్యోగుల సంఘం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు యశోదా హాస్పిటల్స్ కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ కూపన్ ను టిజిపిసిబి ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రఘు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల, టిజిపిసిబి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీవాత్సవ్, సలహాదారు పి. వినయ్ కుమార్ నాయుడు, జాయింట్ సెక్రటరీలు జవహర్ లాల్, సుమతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామప్పా తదితరులు ఆవిష్కరించారు.

26 అక్టోబర్ 2026 నుంచి 25 నవంబర్ 2026 వరకు ఈ ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఆదివారాల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో, పని దినాల్లో ఉద్యోగులకు బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షల కోసం ఒక్కో ఉద్యోగికి ఒకటి నుంచి రెండు గంటల సమయం అవసరమవుతుందని, ఇందుకోసం సంబంధిత రోజు కార్యాలయానికి ఆలస్యంగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగుల సంఘం టిజిపిసిబి ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి లక్కాడి గారిని కోరగా వారు అనుమతించారు. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా వుంటుందని తెలిపారు.